భారత కుస్తీ వీరుడు సందీప్ తులసీ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకం అందించాడు.
భారత కుస్తీ వీరుడు సందీప్ తులసీ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకం అందించాడు. ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా సెర్బియాకు చెందిన మాకిస్మోవిక్ అలెగ్జాండర్ను ఓడించి.. కాంస్యపతకం సాధించాడు. ఇన్నాళ్లూ కేవలం ఫ్రీస్టైల్ విభాగంలో మాత్రమే భారత రెజ్లర్లు తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. కానీ యాదవ్ ఇప్పుడు చరిత్రను తిరగరాసి, గ్రీకో రోమన్ విభాగంలోనూ తమ సత్తాకు ఎదురులేదని చాటాడు. కాంస్యపతకం కోసం జరిగిన పోరులో సెర్బియన్ ప్రత్యర్థిని 4-0 స్కోరు తేడాతో చిత్తుచేశాడు.
ఎలిమినేషన్ రౌండులో సందీప్కు బై లభించింది. రెండో రౌండులో అతడు స్పానిష్ రెజ్లర్ నవర్రో సాంచెజ్ ఇసామెల్ను 5-0తోను, మూడో రౌండులో మాల్దీవ్స్కు చెందిన అకోస్నిసెను మిహాలీని 6-2 స్కోరుతోను ఓడించాడు. కానీ తర్వాతి రౌండులో మాత్రం కొరియన్ వీరుడు ర్యు హన్ సు చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. అయితే.. హన్ సు ఫైనల్లోకి వెళ్లడంతో కాంస్యపతకం రేసులోకి యాదవ్ దూసుకెళ్లాడు. ఈసారి ఏమాత్రం పొరపాటు చేయకుండా అలెగ్జాండర్ను 4-0 తేడాతో చిత్తుచేశాడు.