కరోనా ఉంటే వచ్చే ఏడాదీ అసాధ్యమే

Tokyo Olympics Organizing Committee Chief Yoshiro Mori Speaks About Of Tokyo Olympics - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై ఆర్గనైజింగ్‌ చీఫ్‌ అభిప్రాయం

టోక్యో: కరోనా కరుణిస్తేనే విశ్వక్రీడలు జరుగుతాయని టోక్యో ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌ యొషిరో మోరి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాదీ మెగా ఈవెంట్‌ అసాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. జపాన్‌కు చెందిన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మోరి మాట్లాడుతూ ‘కరోనా ఉధృతి తగ్గాలని ఆశిస్తున్నా. వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితి మారుతుంది. అలా కాకుండా ఇప్పటి తీవ్రత కొనసాగితే ఆటలెలా సాధ్యమవుతాయి చెప్పండి’ అని అన్నారు. మనమంతా కరోనాను తరిమేస్తే ఒలింపిక్స్‌ కచ్చితంగా జరుగుతాయన్నారు.

నిజానికి అన్ని బాగుంటే సరిగ్గా ఈ రోజు (జూలై 23) ఒలింపిక్స్‌కు టోక్యోలో జేగంట మోగేది. కోవిడ్‌ వల్ల సరిగ్గా వచ్చే ఏడాది ఇదే తేదీకి వాయిదా వేశారు. ఆ రీ షెడ్యూల్‌ తేదీ గుర్తుగా గురువారం టోక్యో ప్రధాన స్టేడియంలో చిన్న వేడుక నిర్వహించనున్నారు. కేవలం పదుల సంఖ్యలో పాల్గొనే ముఖ్యులతో ఈ తంతును ముగిస్తారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వచ్చే ఏడాది ఆటల వేడుక జరగాలని జపాన్‌ ప్రభుత్వంలాగే బలంగా కోరుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్‌కు మరో వాయిదా ఉండదని... 2021లో జరగ్గపోతే ఈ విశ్వ క్రీడలను రద్దు చేస్తామని ఇది వరకే స్పష్టం చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top