
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 204 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే షాక్ తగిలింది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ పెరీరా-అవిష్కా ఫెర్నాండాల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 67 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(30) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆపై కాసేపటికి కుశాల్ పెరీరా(30) కూడా ఔట్ కావడంతో లంక 72 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత కుశాల్ మెండిస్(23), ధనంజయ డిసిల్వా(24), జీవన్ మెండిస్(18), తిషారా పెరీరా(21)లు సైతం నిరాశపరిచారు. చివర్లో ఇసురా ఉదానా(17) ఫర్వాలేదనిపించడంతో లంక 49.3 ఓవర్లలో 203 పరుగులు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్, మోరిస్‌లు తలో మూడు వికెట్లు సాధించగా,కగిసో రబడా రెండు వికెట్లు తీశాడు. ఫెహ్లుక్వోయో, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది.