
డివిలియర్స్ కాస్త భిన్నంగా..
టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఓటమిని అడ్డుకునేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయిన సఫారీలు.. ఆఖరి మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించకుండా డ్రాతోనైనా గట్టెక్కాలని భావిస్తున్నారు.
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఓటమిని అడ్డుకునేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయిన సఫారీలు.. ఆఖరి మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించకుండా డ్రాతోనే సరిపెట్టాలని భావిస్తున్నారు. టీమిండియా నిర్దేశించిన 481 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 56.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(19 బ్యాటింగ్;163 బంతుల్లో 3 ఫోర్లు) గోడలా పాతుకుపోయాడు. అంతకుముందు 113 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. మరో 50 బంతులు ఆడి 13 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు.
కాగా, అతనికి జతగా క్రీజ్ లో ఉన్న ఏబీ డివిలియర్స్(1 బ్యాటింగ్) తన సహజ శైలికి కాస్త భిన్నంగా ఆడుతున్నాడు. ఏ ఫార్మెట్ లో నైనా రెచ్చిపోయే డివిలియర్స్ తొలి పరుగును సాధించడానికి 33 బంతులు ఎదుర్కొన్నాడు. దీంతో దక్షిణాఫ్రికాపై మరోసారి గెలిచి సిరీస్ ను సంపూర్ణంగా ముగించాలన్నటీమిండియా ఆశలకు గండి పడేలా ఉంది. అయితే ఈరోజు ఆటతో పాటు ఇంకా సోమవారం కూడా మిగిలి ఉండటంతో టీమిండియా విజయం కోసం శాయశక్తులా పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకపక్క గెలవాలన్న కసి.. మరొపక్క డ్రా చేయాలన్నధృక్పథం ఏది పైచేయి సాధిస్తుందో అనేది తెలియాలంటే రేపటి వరకూ కచ్చితంగా ఆగాల్సిందే.