ఇప్పుడేం జరుగుతోందని... ఐపీఎల్‌ జరగడానికి! 

Sourav Ganguly Speaks About His Lockdown - Sakshi

అందరితో చర్చించాకే లీగ్‌పై నిర్ణయం

నా పదవీకాలంపై ఇప్పుడే చెప్పలేను

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్య  

కోల్‌కతా: ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ అంశానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెరదించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణ   సాధ్యాసాధ్యాలపై మాట్లాడటానికి తన వద్ద ఏమీ లేదని చెప్పారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గంగూలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుత స్థితిలో ఐపీఎల్‌పై ఏం చెప్పమంటారు. ఐపీఎల్‌ను   పక్కన బెట్టండి. ప్రపంచం మొత్తమే స్తంభించిపోయిన వేళలో ఎక్కడా ఏ రకమైన క్రీడలూ జరగడంలేదు’ అని అన్నారు. బీసీసీఐ అధికారులతో, ఫ్రాంచైజీ యాజమాన్యాలతో నేడు చర్చించి ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీపై నిర్ణయం తీసుకుంటామని గంగూలీ తెలిపారు. తన పదవీకాలంపై మాట్లాడే సందర్భం కాదన్న ఈ భారత మాజీ కెప్టెన్‌ పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

ఇప్పుడున్న పరిస్థితి... మీరిచ్చే సందేశం? 
ఇదైతే భయానకస్థితి. నా 46 ఏళ్ల జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. బహుశా ప్రపంచం కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూడలేదనుకుంటా. ఇప్పుడు అందరి బాధ ఒకటే... వచ్చే రెండు వారాల్లో మృతులెందరనే! ఈ దుస్థితి ఇంకెప్పుడూ రాకూడదని ప్రార్థిస్తున్నా.  ఇక నా నుంచి ప్రత్యేక సందేశమంటూ వేరే లేదు. అది స్పష్టం. అందరికీ విదితం. మీ వాళ్ల కోసం, మీ చుట్టూ ఉండే జనం కోసం... మీరు సహనంతో ఉండండి. ఇంట్లోనే ఉండండి. రోడ్లపై తిరుగుతూ అధికారుల్ని ఇబ్బంది పెట్టొద్దు, వైద్యులపై భారం మోపొద్దు.

ఈ ఏడాది ఐపీఎల్‌ భవిష్యత్తు ఏంటి? 
పరిస్థితులేమైనా మెరుగుపడతాయేమోనని మేం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. కానీ ఏమీ మారడంలేదు. చెప్పడానికీ ఏమీ లేదు. విమానాశ్రయాలు బంద్‌. ప్రజలేమో ఇళ్లలోనే! కార్యాలయాలు లాక్‌డౌన్‌. ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు. ఇక ఆటగాళ్లెలా బయటికి వస్తారు. ఎలా ప్రయాణిస్తారు. ఐపీఎల్‌ సంగతి పక్కన బెడితే తాజా స్థితి ప్రపంచంలో ఏ క్రీడనూ జరగనివ్వడం లేదు.

మరి దీనిపై ఎప్పుడు ప్రకటిస్తారు? 
నేడు ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లతో, ఫ్రాంచైజీ యాజమాన్యాలతో చర్చించిన వెంటనే నిర్ణయాన్ని వెల్లడిస్తాం. ఎక్కడికక్కడ స్తంభించిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఆటకు ఏం అవకాశముంటుంది.

సహాయమందించే అనుభవం ఎలా ఉంది? 
బాగుంది. ప్రజలకు ఇలా సాయపడటం గొప్పగా ఉంది. నేనే కాదు చాలా మంది ఈ ప్రపంచంలో, భారత్‌లో స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. తమకు తోచిన దాతృత్వంతో ఆదుకుంటున్నారు. మనం చేసేది చిన్నదైనా... పెద్దదైనా మనసుతో చేస్తే చాలు. ఊహకందని ఈ విపత్తు నుంచి గట్టెక్కేదాకా మనం చేతనైన సాయం ఏ రూపంలోనైనా చేయవచ్చు.

ఈ పరిస్థితి మనకు నేర్పే పాఠం? 
మనకున్నది ఒక్కటే జీవితం. దీన్ని ప్రతిరోజూ సంతోషంగా గడిపేయాలి. ఇప్పుడున్న పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి అనుకోని పరిస్థితులెదురైనపుడు కూడా సానుకూలంగానే మెలగాలి. ఏం చేస్తే సంతోషం కలుగుతుందో అదే చేయాలి. ఇదే ముఖ్యం. ఇదే పాఠం.

మీ పదవీకాలంపై అభిప్రాయం?
ఇప్పుడైతే కోర్టులన్నీ మూతపడ్డాయి. కాబట్టి అప్‌డేట్లు లేవు. దీనికోసం వేచిచూడక తప్పదు. అయితే... ఏం జరగాలో అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు.

రోజంతా ఇంట్లోనే ఎలా గడుపుతున్నారు? 
లాక్‌డౌన్‌ అంటే లాక్‌డౌనేగా. నేను నా కుటుంబంతో కలిసి హాయిగా ఇంట్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి అవకాశమైతే ఉండదు. ఇప్పుడైతే ఉండాల్సి వచ్చింది. నేను కాసేపు బీసీసీఐ పనులు చక్కబెడుతున్నా... అలాగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వ్యవహారాలు చూస్తున్నా. తీరిక దొరికినపుడల్లా టీవీల్లో తాజా పరిస్థితుల్ని తెలుసుకుంటున్నా. ఇంట్లో ఉన్న జిమ్‌లో చెమటోడ్చుతున్నాను. ప్రస్తుతం ఇదే నా దైనందిన జీవన వ్యవహారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top