‘డివిలియర్స్‌కు దేశం కన్నా డబ్బులే ముఖ్యం’

Shoaib Akhtar Slams AB de Villiers for Offering to Come out of Retirement - Sakshi

పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఫైర్‌

ఇస్లామాబాద్‌ : ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దయనీయ పరిస్థితిని చూసి జాలిపడని వారు లేరు. ప్రధాన పేసర్లు స్టెయిన్, ఇన్‌గిడి గాయాలతో దూరం కావడం, బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాలతో ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ పరిస్థితికి ఆ జట్టు మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్సే కారణమని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. డివిలియర్స్‌కు దేశం కన్నా డబ్బులే ముఖ్యమని ఘాటుగా వ్యాఖ్యానించాడు. శనివారం తన సొంత యూట్యూబ్‌ చానెల్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. 

‘ఇటీవల డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనుకున్నానని, దీనికి జట్టు మేనేజ్‌మెంట్‌ అంగీకరించలేదని తెలిపాడు. ఇది ఒక పెద్ద వార్తే కానీ దక్షిణాఫ్రికా పరాజయాల తర్వాత ఈ ప్రకటన చేయడం ఏంటి? నువ్వు(డివిలియర్స్‌) ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ వదిలి ప్రపంచకప్‌ సిద్దం కావాలని చెప్పారు. కానీ నీవు ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌కు ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికావు. నీ దేశం కన్నా డబ్బుకే ప్రాధాన్యతనిచ్చావు. నీవు అలా చేయాల్సింది కాదు. నీవు రిటైర్మెంట్‌ ప్రకటించేటప్పటికి దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి అంత బాగాలేదు. నీ అవసరం జట్టుకు చాలా ఉంది. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. అలాంటి డబ్బులకే ప్రాధాన్యతను ఇస్తూ ప్రపంచకప్‌ టోర్నీని విస్మరించావు. నీవు వదులుకుంది ఈ ప్రపంచకప్‌నే కాదు.. 2020 టీ20 ప్రపంచకప్‌ కూడా. డబ్బులు సంపాదించడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ అది సరియైన పద్దతిలో ఉండాలని చెబుతున్నా. డబ్బుల కన్నా దేశానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలంటున్నా. నువ్వు తిరుగొస్తానన్నప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌ తిరస్కరించిందని చెప్పావు. వారి నిర్ణయం సరైందే. కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటమే పద్దతి కాదు. నీ రిటైర్మెంట్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండు. నీ దేశం గురించి మరిచిపో. నీ వల్ల నీ దేశానికి ఈ దయనీయ పరిస్థితి వచ్చింది. నీవే కనుక జట్టులో ఉంటే మీ మిడిలార్డర్‌ చాలా పటిష్టంగా ఉండేది. ఇంత చెత్త ప్రదర్శన చేసేది కాదు. నీవు నీ దేశం కన్నా డబ్బుకే ప్రాధన్యత ఇవ్వడం విచారకరం’ అంటూ అక్తర్‌ మండిపడ్డాడు.

ఇక డివిలియర్స్‌ 2018 మేలో సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపించి ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా ఏబీడీ పేర్కొన్నాడు. నాడు ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపర్చింది. కనీసం అతడు ప్రపంచ కప్‌ వరకైనా కొనసాగి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, తర్వాత ఏమనుకున్నాడో ఏమో... పునరాగమనం చేయాలని డివిలియర్స్‌ భావించాడు. సరిగ్గా ఏప్రిల్‌ 18న ప్రస్తుత కప్‌నకు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించే సమయానికి కెప్టెన్‌ డు ప్లెసిస్, ప్రధాన కోచ్‌ ఒటిస్‌ గిబ్సన్, సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ లిండా జొండిలతో కూడిన జట్టు యాజమాన్యాన్ని కలిసి తన అభిమతం వెల్లడించాడు. కానీ, గత ఏడాది కాలంగా ఎంపిక ప్రక్రియకు ప్రామాణికమైన దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడంతో వారు ఏబీ ప్రతిపాదనను కనీసం పరిగణించలేదు. ఈ విషయాన్ని ఏబీడీనే ఇటీవల ప్రకటించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top