కనీసం ఇలాగైనా టీమ్‌కు దగ్గరగా..

Rishabh Pant Wishes To Team India Despite World Cup Snub - Sakshi

‘జాతికి ప్రాతినిథ్యం వహించే క్రమంలో బ్లూ జెర్సీ ధరించినపుడు కలిగే భావన.. టీమిండియాను విష్‌ చేయడంలోనూ దొరుకుతుంది. కనీసం ఇలాగైనా టీమ్‌కు దగ్గరగా ఉండొచ్చు. ప్రపంచకప్‌ని మన ఇంటికి తీసుకురండి బాయ్స్‌!! గుడ్‌లక్‌’ అంటూ టీమిండియా స్టార్‌ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్ తన సహచర సభ్యులకు బెస్ట్‌ విషెస్‌ తెలిపాడు. కాగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ప్రపంచ కప్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్‌ 5న సౌతాంప్టాన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుని ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన కోహ్లి సేన.. మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి దమ్ము చూపించింది.

ఇక ప్రపంచకప్‌ జట్టులో తప్పకుండా స్థానం సంపాదిస్తాడని భావించిన రిషభ్‌ పంత్‌కు చివరి నిమిషంలో నిరాశే ఎదురైంది. సుదీర్ఘ చర్చల్లో భాగంగా సెలక్టర్లు అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌వైపు మొగ్గుచూపడంతో పంత్‌కు ఇంగ్లండ్‌ దారులు మూసుకుపోయాయి. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడుతూ..‘రెండో వికెట్‌ కీపర్‌గా ఎవరిని తీసుకోవాలనే చర్చ సుదీర్ఘంగా జరిగింది. అయితే ధోని గాయపడినపుడే వికెట్‌ కీపర్‌ తుది జట్టుకు ఆడతాడు. అలాంటి పరిస్థితి కీలకమైన సెమీస్‌లాంటి మ్యాచ్‌ల్లో వస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయో చర్చించే చివరకు కార్తీక్‌ను సెలక్ట్‌ చేశాం. పంత్‌ ప్రతిభావంతుడే కానీ దురదృష్టవశాత్తు ఆఖర్లో అవకాశాన్ని కోల్పోయాడు’ అని వివరించాడు. అయినప్పటికీ సెలక్టర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు తీవ్రంగా విమర్శించారు.  

   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top