
రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, పట్టుదల రిషభ్ పంత్‌లో బలంగా ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ‘సాధారణంగా పంత్ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతాడు. అదే అతని శైలి. అయితే ఎర్ర బంతితో ఆడినప్పుడు కూడా జట్టు అవసరానికి తగినట్లు తనను తాను మలచుకోగలడు. అతను జాతీయ జట్టులోకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇప్పటినుంచి అతను తన కెరీర్ మరింత బాగా మలచుకోగలడని నమ్ముతున్నా’ అని ద్రవిడ్ అన్నాడు. ‘ప్రస్తుత ఇంగ్లండ్ ‘ఎ’ పర్యటనలో వివిధ సవాళ్లకు తగినట్లుగా ఆడే విధంగా రిషభ్‌కు అవకాశం కల్పించాం. వన్డే టోర్నీ ఫైనల్లో అర్ధ సెంచరీ, విండీస్ ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్‌లో జయంత్‌తో వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం మనం చూశాం’ అని ద్రవిడ్ వివరించాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఇంగ్లండ్‌పై గెలవాలంటే కోహ్లి సేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని సూచించాడు.