ఫైనల్లో పోరాడి ఓడిన సింధు

PV Sindhu defeated in India open finals - Sakshi

ఇండియా ఓపెన్‌ ఫైనల్లో బీవెన్‌ చేతిలో ఓటమి

సాక్షి, న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ను నెగ్గి ఈ ఏడాది సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలనుకున్న భారత ప్లేయర్‌ పీవీ సింధు ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడోర్యాంకర్, టాప్‌ సీడ్, సింధు 18–21, 21–11, 20–22తో ఐదోసీడ్, బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో తడబడిన భారతస్టార్‌ తగిన మూల్యం చెల్లించకుంది.  

మ్యాచ్‌ పాయింట్‌ను కోల్పోయి..
నిర్ణయాత్మక మూడోగేమ్‌లో ఓ దశలో 20–19తో మ్యాచ్‌ పాయింట్‌ ముందు నిలిచిన సింధు తడబడి ఓటమిపాలైంది. తొలిగేమ్‌ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచిన సింధు.. అనంతరం పోరాడి 5–5తో సమం చేసింది ఈదశలో పుంజుకున్న బీవెన్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి 8–5తో నిలిచింది. ఈ స్థితిలో పోరాటపటిమ ప్రదర్శించి భారతస్టార్‌ 9–8తో ముందంజ వేసింది. అనంతరంన క్రమంగా 12–10తో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈదశలో ఇరువురు పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. చివరకు 19–18తో ఆధిక్యంలో నిలిచన అమెరికన్‌ ప్లేయర్‌.. వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలిగేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండోగేమ్‌లో సింధు జూలు విదిల్చింది. కచ్చితమైన షాట్లతో భారత స్టార్‌ చెలరేగడంతో బీవెన్‌ వద్ద సమాధానం లేకపోయింది. ఈ దశలో 13–10తో ముందంజలో నిలిచిన సింధు వరసగా పాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకుంది.

ఇక నిర్ణయాత్మక మూడోగేమ్‌ ఆరంభంలో 4–9తో వెనుకంజలో నిలిచిన సింధు.. అనంతరం పోరాడి స్కోరును సమం చేసింది. ఈదశలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. చివరకు 19–20తో ఓటమి అంచున నిలిచిన బీవెన్‌.. వరుసగా మూడుపాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాలుగోసీడ్, షి యుఖి (చైనా) 21–18, 21–14తో మూడోసీడ్, చై తియాన్‌ చెన్‌ (చైనీస్‌తైపీ)పై విజయం సాధించాడు.

మహిళల డబుల్స్‌లో మూడోసీడ్, ఇండోనేసియా ద్వయం, గ్రెసియా పోలి–అప్రియాని రహయూ విజేతగా నిలవగా.. పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్, ఇండోనేసియా ద్వయం, మార్కస్‌ ఫెర్నాల్డి–కెవిన్‌ సంజయ చాంపియన్‌గా అవతరించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఐదోసీడ్, డెన్మార్క్‌ జోడీ, మథియాస్‌ క్రిస్టియన్‌సెన్‌–క్రిస్టీనా పెడర్సన్‌ విజేతగా నిలిచింది.

 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top