గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యం

participation is more important than winning, PV Sindhu - Sakshi

 సైబరాబాద్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో పీవీ సింధు వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: క్రీడల్లో గెలుపోటముల కంటే పాల్గొనడం ముఖ్యమని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొంది. ఓటమికి నిరాశ చెందకుండా గెలిచే వరకు ప్రయత్నించాలని చెప్పింది. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తోన్న పోలీసుల కృషిపై ఆమె అభినందించింది. ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, టగ్‌ ఆఫ్‌ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌ ఈవెంట్‌లలో పోటీలను నిర్వహించారు.

మాదాపూర్‌ జోన్, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పోలీసులకు మధ్య జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో మాదాపూర్‌ జట్టును విజయం వరించింది. ఈ సందర్భంగా ఆమె విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ క్రీడల్లో లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్, కానిస్టేబుల్స్, ఏడీసీపీ అధికారులు, మినిస్టీరియల్‌ స్టాఫ్, స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్లు పాల్గొన్నారు. తీన్మార్‌ ఫేమ్‌ బిత్తిరి సత్తి ఈ కార్యక్రమంలో సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top