మళ్లీ ప్రపంచాన్ని గెలిచాడు....

Pankaj Advani Thrashes Rival Mike Russell to Win 17th World Title - Sakshi

పంకజ్‌ అద్వానీ ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌

ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ సొంతం

తాము ఎంచుకున్న ఆటలో ఒక్కసారైనా ప్రపంచ చాంపి యన్‌గా నిలవాలని క్రీడాకారులు కలలు కంటారు. అలాంటిది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 17 సార్లు ప్రపంచ టైటిల్‌ సాధిస్తే ఆ ఘనత అసాధారణం. భారత క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ అలాంటి ఘనతనే సాధించాడు. ప్రపంచ టైటిల్‌ అంటే తనకు మంచినీళ్లప్రాయంలా మారిందని నిరూపిస్తూ ఈ బెంగళూరు ఆటగాడు ఆదివారం మరోసారి ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా నిలిచాడు.

దోహా: గత ఏడాది ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత స్టార్‌ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ (150 అప్‌ ఫార్మాట్‌) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ అద్వానీ 6–2 (0–155, 150–128, 92–151, 151–0, 151–6, 151–0, 150–58, 150–21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్‌ రసెల్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. రసెల్‌తో జరిగిన ఫైనల్లో పంకజ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఫ్రేమ్‌ను రసెల్‌ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దక్కించుకున్నాడు.

అయితే రెండో ఫ్రేమ్‌లో పంకజ్‌ తేరుకొని స్కోరును సమం చేశాడు. మూడో ఫ్రేమ్‌ను కోల్పోయిన ఈ భారత స్టార్‌ నాలుగో ఫ్రేమ్‌ నుంచి తన జోరును ప్రదర్శించాడు. రసెల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్‌ 5–2తో రూపేశ్‌ షా (భారత్‌)పై, రసెల్‌ 5–1తో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచారు. సోమవారం ఇదే వేదికపై లాంగ్‌అప్‌ ఫార్మాట్‌లో ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ మొదలుకానుంది. ఈ ఫార్మాట్‌లోనూ పంకజ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. లాంగ్‌అప్‌ ఫార్మాట్‌ పోటీలు ముగిశాక ఈనెల 15న విజేతలకు ట్రోఫీలను అందజేస్తారు.
 
తాజా విజయంతో పంకజ్‌ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్‌ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్‌ (150 అప్‌ ఫార్మాట్‌–2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు  ప్రపంచ బిలియర్డ్స్‌ (టైమ్‌ ఫార్మాట్‌–2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్‌ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్‌ (2014) టైటిల్‌ను సాధించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top