
ఫుట్ బాల్ క్రీడాకారిణి దుర్మరణం
పాకిస్తాన్ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి షహల్యా అహ్మద్జాయ్ బాలోచ్ (21) కారు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
కరాచీ:పాకిస్తాన్ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి షహల్యా అహ్మద్జాయ్ బాలోచ్ (21) కారు ప్రమాదంలో దుర్మరణం చెందింది. గురువారం ఆమె కారులో వెళుతున్న సమయంలో ఐరన్ పూల్ ను ఢీకొట్టి మృత్యువాత పడింది. ఒక రెస్టారెంట్ నుంచి కజిన్ ఫెడియాన్ బాలోక్తో కలిసి టొయోటా క్రూజర్ కారులో తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుని షహల్యా మృతి చెందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో షహల్యా పాసింజర్ సీట్లో కూర్చుని ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.
పాకిస్తాన్ మహిళా ఫుట్ బాల్ జట్టులో స్టైకర్ అయిన ఆమె మృతి వార్తను కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. షహల్యా తమ కుటుంబాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు.పాకిస్తాన్ జట్టులో షహల్యా కీలక సభ్యురాలు. 2014లో ఇస్లామాబాద్ లో జరిగిన దక్షిణాసియా ఫుట్ బాల్ ఫెడరేషన్ చాంపియన్ షిప్లో ఆమె పాకిస్తాన్ తరపున ఆడింది. అదే ఆమెకు చివరి అంతర్జాతీయ ఈవెంట్. గతేడాది మాల్దీవుల్లో జరిగిన క్లబ్ మ్యాచ్ లో షహల్యా హాట్రిక్ గోల్స్ చేసింది. దాంతో విదేశాల్లో జరిగిన క్లబ్ మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన తొలి పాకిస్తాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.