
ముంబై: వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తమ ఆటగాళ్లు భారత లీగ్‌లో చివరి వరకు కొనసాగకుండా ముందే పిలిపించుకొని ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు దీనికి భిన్నంగా స్పందించింది. తమ దేశ ఆటగాళ్లు ఐపీఎల్–12 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది.
‘కివీస్ క్రికెటర్లు ఐపీఎల్ ముగిసేవరకు అందుబాటులో ఉంటారు. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకుంది. మా ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా తగినంత అనుభవం దక్కాలని కోరుకుం టున్నాం. ఐపీఎల్ అలాంటిదే. గత ఏడాది కివీస్ తరఫున 11 మంది ఐపీఎల్ బరిలోకి దిగారు. దీనిని కొనసాగించాలని కోరుకుంటున్నాం’ అని బోర్డు జీఎం జేమ్స్ వేర్ ప్రకటించారు.