అథ్లెటిక్స్‌ అదిరెన్‌ | National Junior Athletics Competitions in amaravati | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ అదిరెన్‌

Nov 18 2017 12:18 PM | Updated on May 25 2018 7:06 PM

National Junior Athletics Competitions in amaravati - Sakshi

రాజధాని నడిబొడ్డున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ప్రారంభమైన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు సమన్వయానికి ఆత్మ విశ్వాసం జత చేసి ప్రతి ఆటలోనూ తమకు తామే సాటి అంటూ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. హర్డిల్స్‌ అండర్‌– 20 విభాగంలో ఏపీ అథ్లెట్‌ బోణీ కొట్టాడు.

ఉత్సాహం తోడుగా.. ఆకాశమే హద్దుగా అథ్లెట్లు చెలరేగిపోయారు.పతకాలు లక్ష్యంగా ప్రతిభ చూపారు. జాతీయ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం వివిధ విభాగాల్లో పోటీలు ఉత్కంఠ       రేపాయి. పలువురు అథ్లెట్లు సత్తాచాటి రికార్డులు బద్దలుకొట్టారు. హరియాణ క్రీడాకారులు అదరగొట్టారు. హర్డిల్స్‌లో ఏపీ పతకాల ఖాతా తెరిచింది. అథ్లెటిక్‌ సంబరం పసందుగా సాగి క్రీడాప్రియులకు పరమానందం పంచింది.

ఏఎన్‌యూ : క్రీడాకారుల అసాధారణ ప్రతిభ, అత్యున్నత క్రీడా ప్రదర్శనల నడుమ నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ హోరాహోరీగా సాగాయి. ఏపీ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌యూ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రోజైన శుక్రవారం పలు అథ్లెటిక్‌ అంశాల్లో పోటీలు ఉత్కంఠగా సాగాయి. అండర్‌ 20 విభాగంలో బాలుర కేటగిరీలో ఏపీకి చెందిన అథ్లెట్‌ జి.గోపీచంద్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వివిథ అథ్లెటిక్‌ అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారి వివరాలు
వరుసగా..

కనుల పండువగా బహుమతి ప్రదానోత్సవం
ఏఎన్‌యూ క్రీడా మైదానంలో శుక్రవారం సాయంత్రం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం కనుల పండువగా సాగింది. పతకాన్ని చూసిన ఆనందంలో ప్రతిభచూపిన అథ్లెట్లు ఇన్నాళ్లు పడిన కష్టాలు, కఠోర శ్రమను మర్చిపోయి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండటంతో తొలిరోజు పోటీల విజేతల్లో కొందరికి, రెండో రోజు పోటీల విజేతలకు సాయంత్రం క్రీడా మైదానంలోని వేదిక వద్ద బహుమతులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ఏఎఫ్‌ఐ సెక్రటరీ సీకే వల్సన్, ఏపీఏ సెక్రటరీ ఎ.రాఘవేంద్రరావు తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

అండర్‌– 20 విభాగంలో..
బాలికల 10000 మీటర్ల నడక : బన్దన సాటిల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ప్రియాంక పాటిల్‌ (ఉత్తరప్రదేశ్‌), సోనాల్‌ శుక్లా (రాజస్థాన్‌).
బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌ : సచిన్‌ బిను (కేరళ),  కూనాల్‌ చౌదరి (ఢిల్లీ), జి.గోపీచంద్‌ (ఆంధ్రప్రదేశ్‌).
బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌ : సప్నాకుమారి (జార్ఖండ్‌), ఆర్‌.నిత్య (తమిళనాడు), రిత్విక్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌).
బాలికల పోల్‌వాల్ట్‌ : అర్షా బాబు (కేరళ), అన్జలి ఫ్రాన్సిస్‌ సి (కేరళ), ప్రీతిక (తమిళనాడు ).
బాలికల జావలిన్‌త్రో : మౌనిక (హరియాణ), రున్‌జున్‌ పేగు (అసోం), కవితా గోస్వామి (ఢిల్లీ).
అండర్‌–18 విభాగంలో..
బాలుర హేమర్‌త్రో : దమీన్నత్‌ సింగ్‌ (ఏఎఫ్‌ఐ, పంజాబ్‌), నితీష్‌ పూనియా (రాజస్థాన్‌), అలీముద్దీన్‌ (ఉత్తరప్రదేశ్‌).
బాలుర 10000 మీటర్ల నడక : సంజయ్‌ కుమార్‌ (హరియాణ), అదీప్‌ సింగ్‌ (ఏఎఫ్‌ఐ పంజాబ్‌), సూరజ్‌ పన్వార్‌ (ఉత్తరప్రదేశ్‌).
బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌ : అపర్ణారాయ్‌ (కేరళ), ప్రతిభాకుమారి (జార్ఖండ్‌), అంజల్య థోమాస్‌ (కేరళ).
బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌ : పున్గా సోరెన్‌ (ఒడిస్సా), అభిషేక్‌ యూబీ (మహారాష్ట్ర), సత్యం మిశ్రా (ఉత్తరప్రదేశ్‌).
బాలికల జావలిన్‌త్రో : ఎన్‌.హేమమాలిని (తమిళనాడు), అంజని కుమారి (బిహార్‌), ప్రియాంకా తోప్పో (ఒడిస్సా).
బాలుర లాంగ్‌జంప్‌ : లోకేష్‌ ఎస్‌ (కర్ణాటక), గోవింద్‌ కుమార్‌ (ఉత్తరప్రదేశ్‌), రిషాబ్‌ రిషీశ్వర్‌ (ఉత్తరప్రదేశ్‌).
బాలుర షాట్‌పుట్‌ : దీపేందర్‌ దబాస్‌ (హరియాణ), సత్యావాన్‌ (హరియాణ),  హర్జోత్‌ సింగ్‌ (ఏఎఫ్‌ఐ).

అండర్‌–16  విభాగంలో..
బాలుర హేమర్‌త్రో : విపిన్‌ కుమార్‌ (ఉత్తరప్రదేశ్‌), సామ్సూల్‌ ఇర్ఫాన్‌ (ఉత్తరప్రదేశ్‌), ప్రశాంత్‌ త్రివేది (గుజరాత్‌).
బాలుర జావలిన్‌త్రో : వికాస్‌ యాదవ్‌ (మహారాష్ట్ర), సన్దీప్‌ (హరియాణ), దేవ్రాజ్‌ (రాజస్థాన్‌).
బాలుర 100 మీటర్ల హర్డిల్స్‌ : ఆదిత్య ప్రకాష్‌ (జార్ఖండ్‌), సూర్యజిత్‌ ఆర్‌కే (కేరళ), దిబ్యసుందర్‌దాస్‌ (పశ్చిమబెంగాల్‌).
బాలికల 600 మీటర్ల పరుగు : గౌతమి (కర్ణాటక), సాక్షి ఫుల్‌సుందర్‌ (మహారాష్ట్ర), హర్షిలీన్‌ కౌర్‌ (ఉత్తరాఖండ్‌).
బాలుర స్ప్రింట్‌ (600 డాష్‌లో) : రాబి ఖోరా (ఒడిస్సా), రితేష్‌ ఓరే (ఏఎఫ్‌ఐ), గౌరవ్‌ యాదవ్‌ (ఏఎఫ్‌ఐ).

హరియాణ అథ్లెట్ల హవా
నేషనల్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొదటి, రెండో రోజు జరిగిన పోటీల్లో హరియాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్‌లు హవా ప్రదర్శించారు. శుక్రవారం సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో హరియాణ అథ్లెట్లు పలు క్రీడాంశాల్లో మొత్తం 18 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. వీరు మొదటి స్థానాలు 8, ద్వితీయ స్థానాలు 5, తృతీయ స్థానాలు 5 సాధించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వివిధ క్రీడాంశాల్లో మొత్తం 14 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. వీరు పతకాల్లో మూడు మొదటి స్థానాలు, 7 ద్వితీయ స్థానాలు, 4 తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల ఏఎన్‌యూ వేదికగా జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేరళ అథ్లెట్‌లు ప్రస్తుతం జరుగుతున్న జూనియర్‌ నేషనల్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో కొంత వెనుకబడ్డారు. వివిధ అథ్లెటిక్‌ అంశాల్లో మొత్తం 12 పతకాలను కేరళ రాష్ట్రం సాధించింది. వీటిలో 5 మొదటి బహుమతులు, 5 ద్వితీయ బహుమతులు, 2 తృతీయ బహుమతులు ఉన్నాయి.  

ప్రేక్షకుల ప్రోత్సాహం  అదుర్స్‌  
రెండో రోజు పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఏఎన్‌యూ సింథటిక్‌ ట్రాక్‌ వెలుపల ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని అథ్లెట్‌లను చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రేక్షకుల చప్పట్లు అథ్లెట్‌లకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. గెలుపొందిన అథ్లెట్‌లతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు సహచర క్రీడాకారులు, ప్రేక్షకులు పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement