
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారిక ట్విటర్ ఆకౌంట్ కవర్ ఫోటోగా ధోని చిత్రాన్ని పెట్టుకుంది. ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో ధోని అద్భుత ఆటతీరుకు గుర్తుగా ఐసీసీ ట్విటర్‌లో ధోని కవర్ ఫోటో పెట్టినట్టు వివరించింది. దీంతో జార్ఖండ్ డైనమెట్ అభిమానులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ట్విటర్‌కు సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్‌లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా గొప్ప వ్యక్తి ఫోటోను ఐసీసీ తన ట్విటర్ కవర్ ఇమేజ్‌గా పెట్టుకుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఐసీసీ ధోని ఆటను గుర్తించిందని.. కానీ విమర్శకులు గర్తించారో లేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కోహ్లి సేన ఆస్ట్రేలియాపై చారిత్రక వన్డే సిరీస్ గెలవడంతో ధోని కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. వరుస మూడు ఆర్దసెంచరీలతో అదరగొట్టిన ధోని ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కూడా కైవసం చేసుకున్నాడు. ఆసీస్‌పై ధోని ఆడిన అద్వితీయమైన ఆటతీరుతో రిటైర్మెంట్ తీసుకోవాలంటూ విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించాడు. 37ఏళ్ల ఈ వెటరన్ ఆటగాడు ఇప్పటివరకు 335 వన్డేల్లో 50కి పైగా సగటుతో 10,366 పరుగులు చేశాడు. ఇందులో పది శతకాలు, 70 అర్ద సెంచరీలు ఉన్నాయి. కీపింగ్‌లోనూ ఎదురు లేని ధోని ఇప్పవటివరకు వన్డేల్లో 311 క్యాచ్‌లు, 117 స్టంపింగ్స్ చేశాడు. ఇక ఆసీస్ పర్యటన విజయవంతంగా ముగించుకున్న టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. కివీస్ పర్యటనలో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.