షరపోవా జోరు

షరపోవా జోరు


మూడో రౌండ్‌లోకి రష్యా స్టార్

 జొకోవిచ్, రావ్‌నిక్ ముందంజ

 వింబుల్డన్ టోర్నమెంట్


 

 

 పేస్ జంట శుభారంభం

 పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) ద్వయం 6-3, 6-4, 7-5తో విక్టర్ ట్రయెస్కీ-దుసాన్ లాజోవిచ్ (సెర్బియా) జంటను ఓడిం చింది. అయితే పురవ్ రాజా (భారత్)-ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ మాత్రం 1-6, 4-6, 6-4, 6-7 (7/9)తో జొనాథన్ ముర్రే (బ్రిటన్)-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.

 

 

 లండన్: పచ్చికపై పసందైన ఆటతీరుతో రష్యా స్టార్ మరియా షరపోవా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత (35.7 డిగ్రీలు) నమోదైన వేళ ఈ మాజీ చాంపియన్ ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోక విజయంతో ముందంజ వేసింది. క్వాలిఫయర్ రాచెల్ హోగెన్‌క్యాంప్ (నెదర్లాండ్స్)తో జరిగిన రెండో రౌండ్‌లో నాలుగో సీడ్ షరపోవా 6-3, 6-1తో గెలిచింది.

 

 

  1976 తర్వాత వింబుల్డన్‌లో తొలిసారి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఎండ నిబంధన అమల్లోకి వచ్చింది. ఫలితంగా మహిళల విభాగం మ్యాచ్‌ల్లో రెండో సెట్ ప్రారంభానికి ముందు పది నిమిషాలు విరామం ఇచ్చారు. రాచెల్‌తో జరిగిన మ్యాచ్‌లో షరపోవా ఏకంగా ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసినా, కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.

 

 ప్లిస్కోవాకు షాక్

 మరోవైపు 11వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. వాండెవెగె (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా 6-7 (5/7), 4-6తో ఓటమి చవిచూసింది. ఇతర మ్యాచ్‌ల్లో 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-4తో ఉర్సులా రద్వాన్‌స్కా (పోలండ్)పై, 30వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7-5, 4-6, 6-0తో ఫ్రీడ్‌సమ్ (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

 

 మూడో రౌండ్‌లో దిమిత్రోవ్

 పురుషుల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), ఏడో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)లతోపాటు 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో షరపోవా ప్రియుడు దిమిత్రోవ్ 7-6 (10/8), 6-2, 7-6 (7/2)తో జాన్సన్ (అమెరికా)పై, జొకోవిచ్ 6-4, 6-2, 6-3తో నిమినెన్ (ఫిన్‌లాండ్)పై, రావ్‌నిక్ 6-0, 6-2, 6-7 (5/7), 7-6 (7/4)తో టామీ హాస్ (జర్మనీ)పై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-7 (5/7), 7-6 (8/6), 6-4, 6-4తో ఇల్హాన్ (టర్కీ)పై, 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7-6 (7/3), 6-1, 6-1తో బ్రాడీ (బ్రిటన్)పై, 26వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-6 (7/5), 6-3, 6-4తో యువాన్ మొనాకో (అర్జెంటీనా)పై, 27వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) 7-6 (7/3), 6-4, 7-6 (7/5)తో హెర్బెర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గారు.

 

 వైదొలిగిన నిషికోరి

 మరోవైపు ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) గాయం కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. రెండో రౌండ్‌లో సాంటియాగో గిరాల్డో (కొలంబియా)తో ఆడాల్సిన నిషికోరి బరిలోకి దిగలేదు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top