
వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ధోనీ!
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మహేంద్రసింగ్ ధోనీ తన సొంత గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మహేంద్రసింగ్ ధోనీ తన సొంత గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గురువారం నుంచి మొదలవుతున్న విజయ్ హజారే టోర్నీలో జార్ఖండ్ జట్టు తరఫున ధోనీ ఆడుతున్నాడు. అయితే, ఇందులో మరో విశేషం ఉంది. ధోనీ కెప్టెన్సీ వహించడం లేదు.. వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో చిట్టచివరి సారిగా ధోనీ 2007లో సయ్యద్ ముష్తాక్ అలీ టి20 ఛాంపియన్‌షిప్‌లో జార్ఖండ్ కోసం ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో బిజీగా ఉండటంతో అసలు దేశవాళీ క్రికెట్ వైపు చూడలేదు. ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఇప్పుడు మళ్లీ తన సొంత రాష్ట్రం జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ధోనీకి లభించింది.
నిజానికి ధోనీనే పగ్గాలు చేపట్టాలని జార్ఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి రాజేష్ వర్మ కోరారు. కానీ ధోనీ మాత్రం దాన్ని సున్నితంగా తోసిపుచ్చి.. ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌కు ఆ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ధోనీయే రాష్ట్రం తరఫున ఆడతానని అడిగినట్లు వర్మ చెప్పారు. కానీ మొత్తం టోర్నమెంటుకు ధోనీ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. ఇండో-పాక్ సిరీస్‌కు భారత ప్రభుత్వం ఓకే చెబితే డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు భారత జట్టుకు ధోనీ వెళ్లాల్సి ఉంటుంది.