ఎన్నాళ్లకెన్నాళ్లకు...

Lakshya Sen wins India's first men's singles gold in 53 years - Sakshi

ఆసియా జూనియర్‌ చాంప్‌ లక్ష్య సేన్‌

53 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో భారతీయ ప్లేయర్‌కు టైటిల్‌

ఫైనల్లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌పై విజయం  

అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్‌ యువతార లక్ష్య సేన్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 53 ఏళ్ల విరామం తర్వాత పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున ఆసియా జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన షట్లర్‌గా గుర్తింపు పొందాడు. జకార్తాలో ఆదివారం జరిగిన అండర్‌–19 పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్‌ వరుస గేముల్లో ప్రస్తుత జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించాడు.   

జకార్తా (ఇండోనేసియా): ఆద్యంతం తన సంచలన ప్రదర్శన కొనసాగించిన భారత బ్యాడ్మింటన్‌ యువస్టార్‌ లక్ష్య సేన్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌ షిప్‌లో విజేతగా అవతరించాడు. ఆదివారం అండర్‌–19 పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–18తో టాప్‌ సీడ్, ప్రస్తుత జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో లక్ష్య సేన్‌ నలుగురు సీడెడ్‌ క్రీడాకారులపై నెగ్గడం విశేషం.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 11వ సీడ్‌ సరన్‌ జామ్‌శ్రీ (థాయ్‌లాండ్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ లీ షిఫెంగ్‌ (చైనా)పై, సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ ఇక్షన్‌ రుమ్‌బే (ఇండోనేసియా)పై, ఫైనల్లో టాప్‌ సీడ్‌ కున్లావుత్‌పై లక్ష్య సేన్‌ గెలుపొందాడు. వరుసగా మూడో ప్రయత్నంలో లక్ష్య సేన్‌ ఖాతాలో ఆసియా స్వర్ణ పతకం చేరడం విశేషం. 2016లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్‌ కొల్లగొట్టాడు.  

నిలకడగా ఆడుతూ...  
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన 16 ఏళ్ల లక్ష్య సేన్‌ కుటుంబానికి బ్యాడ్మింటన్‌ నేపథ్యం ఉంది. లక్ష్య సేన్‌ సోదరుడు చిరాగ్‌ సేన్‌ అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా...  తండ్రి డీకే సేన్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌గా ఉన్నారు. తాత చంద్రలాల్‌ సేన్‌ ప్రోత్సాహంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టిన లక్ష్య సేన్‌ బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీలో కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2014లో స్విస్‌ ఓపెన్‌ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చిన లక్ష్య సేన్‌ అదే ఏడాది డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాకుండా జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.  

‘బాయ్‌’ నజరానా రూ. 10 లక్షలు...
ఆసియా జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన లక్ష్య సేన్‌కు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. ‘ఆసియా టైటిల్‌ గెలిచి లక్ష్య సేన్‌ దేశం మొత్తం గర్వపడేలా చేశాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు.  

భారత్‌ తరఫున 1965లో గౌతమ్‌ ఠక్కర్‌ (మహారాష్ట్ర) పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఆసియా జూనియర్‌ చాంపియన్‌గా నిలిచాడు. అనంతరం సమీర్‌ వర్మ 2011లో రజతం, 2012లో కాంస్యం... 2016లో లక్ష్య సేన్‌ కాంస్యం గెలిచారు. 2009లో ప్రణవ్‌ చోప్రా–ప్రజక్తా సావంత్‌ ద్వయం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం గెలిచింది. 2011లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్యం, 2012లో స్వర్ణ పతకం సాధించింది.  

 ఆసియా టోర్నీలో టైటిల్‌ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో తొలుత టీమ్‌ ఈవెంట్‌లో, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పోటీపడ్డాను. క్వార్టర్‌ ఫైనల్లో చైనా ప్లేయర్‌ను ఓడించాక టైటిల్‌ సాధిస్తాననే నమ్మకం పెరిగింది. టోర్నీ సందర్భంగా కాలి కండరాల గాయమైంది. నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటూ మ్యాచ్‌లు కొనసాగించాను.
–లక్ష్య సేన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top