
‘సన్’ నిలిచింది
లీగ్ దశలో కోల్‌కతాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన నాకౌట్‌లో మాత్రం జూలు.....
► రాణించిన యువరాజ్ సింగ్
► హెన్రిక్స్ ఆల్‌రౌండ్ షో
► ఇక ఫైనల్ బెర్త్ కోసం రేపు గుజరాత్‌తో హైదరాబాద్ పోరు
ఎలిమినేటర్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం
ఐపీఎల్‌లో అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్నా... చివరి దశలో పేలవ ఆటతీరుతో ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చిన సన్‌రైజర్స్... అసలైన నాకౌట్ మ్యాచ్‌లో సిసలైన ఆటతీరుతో అదరగొట్టింది. రెండుసార్లు చాంపియన్ కోల్‌కతాను చిత్తు చేసి టైటిల్‌కు రెండు విజయాల దూరంలో నిలిచింది. ఇక రేసులో మిగిలిన మూడు జట్లూ (బెంగళూరు, సన్‌రైజర్స్, గుజరాత్) ఎప్పుడూ టైటిల్ గెలవలేదు. కాబట్టి ఈ సారి కొత్త విజేతను చూడొచ్చు.
న్యూఢిల్లీ: లీగ్ దశలో కోల్‌కతాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన నాకౌట్‌లో మాత్రం జూలు విదిల్చింది. అన్ని రంగాల్లో అద్భుతమైన పోరాటపటిమ చూపిస్తూ తక్కువ స్కోరు మ్యాచ్‌ను కాపాడుకుంది. దీంతో ఐపీఎల్-9లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 22 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (30 బంతుల్లో 44; 8 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిక్స్ (21 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), వార్నర్ (28 బంతుల్లో 28; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే (28 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. గంభీర్ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (15 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. హెన్రిక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
యువీ పోరాటం
రెండు మార్పులతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు రెండో ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు బౌండరీలతో జోరు మీదున్న ధావన్ (10 బంతుల్లో 10; 2 ఫోర్లు) మోర్కెల్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వార్నర్‌తో పాటు కొత్తగా వచ్చిన హెన్రిక్స్ కూడా ఆచితూచి ఆడటంతో రన్‌రేట్ మందగించింది. పవర్‌ప్లే చివరి రెండు ఓవర్లలో ఈ ఇద్దరూ వేగంగా ఆడటంతో హైదరాబాద్ 43 పరుగులు చేసింది. ఇక ఇక్కడి నుంచి ఈ జోడి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేషన్ చేసింది. అయితే పదో ఓవర్‌లో స్పిన్నర్ కుల్దీప్ నైట్‌రైడర్స్‌కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఈ ఇద్దర్ని అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన యువరాజ్, దీపక్ హుడా (13 బంతుల్లో 21; 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. సతీష్ బౌలింగ్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన యువీ... 13వ ఓవర్‌లో ఫోర్, సిక్స్‌తో 12 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు నిలకడగా ఆడటంతో 15 ఓవర్లలో సన్ స్కోరు 3 వికెట్లకు 109 పరుగులకు చేరుకుంది.
16వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదిన హూడా అనూహ్యంగా రనౌట్ కాగా... ఆ వెంటన్ కటింగ్ (0) కూడా వెనుదిరిగాడు. హుడా, యువీ నాలుగో వికెట్‌కు 49 పరుగులు జత చేశారు. ఈ దశలో యువరాజ్ వరుస బౌండరీలతో కాస్త వేగం పెంచినా... 19వ ఓవర్‌లో యువీతో పాటు ఓజా (7) కూడా అవుటయ్యాడు. ఆఖరి ఓవర్‌లో బిపుల్ శర్మ (14 నాటౌట్) రెండు సిక్సర్లు కొట్టడంతో హైదరాబాద్‌కు పోరాడే స్కోరు లభించింది. కుల్దీప్‌కు 3 వికెట్లు దక్కాయి.
‘టాప్’ విఫలం
లక్ష్య ఛేదనలో నైట్‌రైడర్స్ రెండో ఓవర్‌లోనే ఉతప్ప (11) వికెట్ కోల్పోయినా... కెప్టెన్ గంభీర్, మున్రో (16)లు సమయోచితంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో పవర్‌ప్లేలో కోల్‌కతా వికెట్ నష్టానికి 46 పరుగులు సాధించింది. అయితే ఏడో ఓవర్ నుంచి సన్ బౌలర్లు, ఫీల్డర్లు పట్టు బిగించారు. యువీ డెరైక్ట్ త్రోతో మున్రోను రనౌట్ చేస్తే, తర్వాతి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచారు. మున్రో, గంభీర్ రెండో వికెట్‌కు 38 పరుగులు జత చేశారు. ఇక పదో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గంభీర్, ఆ తర్వాతి ఓవర్‌లో యూసుఫ్ (2) అవుట్‌కావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ తడబడింది.
ఈ దశలో మనీష్ పాండే, సూర్యకుమార్ కుదురుగా ఆడారు. 16వ ఓవర్లో సూర్యకుమార్ అవుట్ కావడంతో... ఐదో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 24 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన దశలో మనీష్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇక గెలుపునకు ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు అవసరంకాగా... సతీష్ (8), హోల్డర్ (6)లు అవుటయ్యారు. భువీ ఈ ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) కుల్దీప్ యాదవ్ 28; ధావన్ (బి) మోర్కెల్ 10; హెన్రిక్స్ (సి అండ్ బి) కుల్దీప్ యాదవ్ 31; యువరాజ్ (బి) హోల్డర్ 44; హూడా రనౌట్ 21; కటింగ్ (స్టంప్) ఉతప్ప (బి) కుల్దీప్ యాదవ్ 0; నమన్ ఓజా (సి) ఉతప్ప (బి) హోల్డర్ 7; భువనేశ్వర్ (సి) పాండే (బి) మోర్కెల్ 1; బిపుల్ శర్మ నాటౌట్ 14; బరీందర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1-12; 2-71; 3-71; 4-120; 5-124; 6-145; 7-147; 8-161.
బౌలింగ్: యూసుఫ్ 3-0-17-0; మోర్నీ మోర్కెల్ 4-0-31-2; నరైన్ 4-0-35-0; హోల్డర్ 4-0-33-2; కుల్దీప్ యాదవ్ 4-0-35-3; సతీష్ 1-0-9-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 11; గంభీర్ (సి) సబ్ శంకర్ (బి) కటింగ్ 28; మున్రో రనౌట్ 16; మనీష్ పాండే (సి) హుడా (బి) భువనేశ్వర్ 36; యూసుఫ్ (సి) భువనేశ్వర్ (బి) హెన్రిక్స్ 2; సూర్యకుమార్ (సి) ధావన్ (బి) హెన్రిక్స్ 23; సతీష్ (బి) భువనేశ్వర్ 8; హోల్డర్ (సి) కటింగ్ (బి) భువనేశ్వర్ 6; నరైన్ నాటౌట్ 1; మోర్కెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1-15; 2-53; 3-63; 4-69; 5-115; 6-125; 7-139; 8-140.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-19-3; శరణ్ 3-0-29-1; దీపక్ హుడా 1-0-8-0; ముస్తఫిజుర్ 4-0-28-0; హెన్రిక్స్ 3-0-17-2; కటింగ్ 3-0-14-1; బిపుల్ శర్మ 2-0-16-0.
► ఎలిమినేటర్‌లో విజయం సాధించడం ద్వారా హైదరాబాద్ జట్టు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు గుజరాత్ లయన్స్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం బెంగళూరుతో ఫైనల్ ఆడుతుంది.