
ఐపీఎల్ చేసేదేముంది:యువరాజ్
మహారాష్ట్రలో చోటు చేసుకున్న నీటి కరువు కారణంగా ఆ రాష్ట్రంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లను వేరే చోటకి తరలించాలనడం ఎంతమాత్రం సబబు కాదని వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
ముంబై: మహారాష్ట్రలో చోటు చేసుకున్న నీటి కరువు కారణంగా ఆ రాష్ట్రంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లను వేరే చోటకి తరలించాలనడం ఎంతమాత్రం సబబు కాదని వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అసలు అక్కడ ఏర్పడ్డ కరువుకు, ఐపీఎల్కు ఎటువంటి సంబంధం లేదని యువీ అభిప్రాయపడ్డాడు. 'ఒక రాష్ట్రంలో నీటి సమస్యతో కరువు ఏర్పడితే అందుకు ఐపీఎల్ చేసేదేముంది. రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భిక్ష పరిస్థితికి ఓ క్రీడను ముడి పెట్టడం సమంజసం కాదు. ఆటను ఆటలాగే చూడాలి కానీ, వివిధ కారణాలతో వేరే సంబంధాలు అంటగట్టడం తగదు'అని యువరాజ్ పేర్కొన్నాడు.
అయితే ఒక క్రికెటర్ గా తాను అంతకు మించి మాట్లడలేనని యువీ తెలిపాడు. ఆ అంశంపై ఇంకా లోతుగా మాట్లాడం తన పని కాదని స్పష్టం చేశాడు. ఓ క్రికెటర్ గా ఎక్కడ మ్యాచ్లు నిర్వహించినా అక్కడి వెళ్లి ఆడటమే తన కర్తవ్యంలో భాగమన్నాడు. ఇటీవల వరల్డ్ టీ 20 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువరాజ్ ఆ తరువాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఆ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్ ల్లో పాల్గొనలేదు.