
లండన్: లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో ఆడుతుండటంతో... పాకిస్తాన్‌తో లార్డ్స్‌లో జరగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 179 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో ఆరు వికెట్లకు 235 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 56 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను బట్లర్ (66 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెస్ (55 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఆదుకున్నారు.
వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 125 పరుగులు జోడించారు. కుక్ (1), స్టోన్‌మన్ (9), మలాన్ (12), బెయిర్‌స్టో (0), స్టోక్స్ (9) విఫలమయ్యారు. కెప్టెన్ రూట్ (68; 8 ఫోర్లు) రాణించాడు. పాక్ బౌలర్లలో అమీర్, అబ్బాస్, షాదాబ్ ఖాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగుల వద్ద ఆలౌటైంది.