టోక్యో 2021 జూలై 23–ఆగస్టు 8

International Olympic Committee Announces Olympic Dates - Sakshi

ఒలింపిక్స్‌ క్రీడల తేదీలను ప్రకటించిన ఐఓసీ

ఆలస్యానికి అదనపు ఖర్చు రూ. 45 వేల కోట్లు!

2020 జూలై 24 నుంచి 2021 జూలై 23కు... 364 రోజులు ఆలస్యంగా విశ్వ క్రీడా సంబరం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. కరోనా దెబ్బకు తల్లడిల్లిపోతున్న ప్రపంచం కోలుకొని మళ్లీ ఆటలపై మనసు పెట్టేందుకు ఈ సమయం సరిపోతుందని భావించిన నిర్వాహకులు దాదాపుగా అసలు షెడ్యూల్‌లో ఉన్న తేదీలనే మరుసటి ఏడాది కోసం కూడా ప్రకటించారు. ఒలింపిక్స్‌కు సంబంధించి అధికారికంగా వాయిదా, ఆపై మళ్లీ నిర్వహించే తేదీలపై కూడా స్పష్టత కూడా వచ్చేసింది. వచ్చే సంవత్సరం కోసం తమ ప్రణాళికలతో ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు సన్నద్ధం కావడమే ఇక మిగిలింది. అయితే ఈ వాయిదా పర్వం నిర్వహణ కమిటీకి భారీ స్థాయిలో ఆర్థికభారంగా మారనుండటమే ప్రతికూలాంశం.

టోక్యో: వారం రోజుల క్రితం వరకు కూడా టోక్యో ఒలింపిక్స్‌ తేదీల్లో మార్పు ఉండదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఇప్పుడు ఆరు రోజుల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు ప్రకటించాల్సి వచ్చింది. గత మంగళవారం ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నామని చెప్పిన ఐఓసీ, ఈ సోమవారం పోటీలు నిర్వహించే తేదీలను కూడా ప్రకటించింది. 2021లో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు క్రీడలు జరుపుతామని టోక్యో 2020 చీఫ్‌ యోషిరో మొరీ వెల్లడించారు. వా యిదా పడక ముందు అసలు షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన షెడ్యూల్‌ ఒకే ఒక రోజు తేడాతో ఉండటం విశేషం. పారాలింపిక్స్‌ను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నిర్వహిస్తారు.

సన్నద్ధతకు సమయం... 
నిర్వాహక కమిటీ సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఐఓసీతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ఒలింపిక్స్‌ నిర్వహణా సమయం అసలు తేదీల తరహాలోనే జపాన్‌ వేసవిలో ఉండాలని చాలాసార్లు చర్చ జరిగింది. దీనికి మేమంతా అంగీకరించాం. కరోనా వైరస్‌ తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు సన్నాహాలకు, క్వాలిఫయింగ్‌కు కొంత సమయం కావాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని యోషిరో వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తేదీల ప్రకారం చూస్తే అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఐఓసీ పేర్కొంది. ‘ప్రస్తుత విపత్కర స్థితి కారణంగా ప్రపంచం పరిస్థితి చీకట్లో మగ్గుతున్నట్లుగా ఉంది. అలాంటి సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌ వెలుగులు విరజిమ్మే కాంతిలాంటిది. వచ్చే ఏడాది ఈ ఒలింపిక్స్‌ను నిర్వహించడం ద్వారా వైరస్‌పై మానవజాతి సాధించిన విజయంగా మనం భావించాలి’ అని యోషిరో వ్యాఖ్యానించాడు.

అక్షరాలా 6 బిలియన్‌ డాలర్లు అదనం! 
2011లో జపాన్‌ మూడు రకాల ప్రకృతి విపత్తులకు గురైంది. భారీ భూకంపం, సునామీలతో పాటు ఫుకుషిమా ప్రాంతంలో పెద్ద ఎత్తున అణు విస్ఫోటనం జరిగింది. వాటిని తట్టుకొని తాము ముందుకు సాగుతున్నామని రుజువు చేసి చూపాలనే సంకల్పంతో ఒలింపిక్స్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్‌ను సంవత్సరంపాటు వాయిదా వేయడం వల్ల ఆర్థికపరంగా ఆ దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాదిలో జరగాల్సిన ఒలింపిక్స్‌ నిర్వహణ వ్యయం 12 బిలియన్‌ డాలర్లు (సుమారు. రూ. 90 వేల కోట్లు)గా ఉంది. ఒప్పందం ప్రకారం ఈ బడ్జెట్‌ను నిర్వాహక కమిటీ, జపాన్‌ ప్రభుత్వం, టోక్యో మహా నగరం కలిపి భరిస్తాయి. ఇందులో ఐఓసీ ఇస్తున్న 1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 10 వేల కోట్లు), ప్రైవేట్‌ సంస్థల ద్వారా సేకరించిన 5.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 42 వేల కోట్లు) మినహా మిగిలినదంతా జపాన్‌ ప్రజాధనమే. అయితే ఏడాది ఆలస్యం ఏకంగా మరో 50 శాతం అదనపు మొత్తం మీద పడే పరిస్థితి వస్తోంది.

అదనంగా మరో 6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 45 వేల కోట్లు) కేటాయించాల్సి వస్తుందని జపాన్‌ ఆర్థికరంగ నిపుణుల అంచనా. సంవత్సరం పాటు కొత్తగా కట్టిన స్టేడియాల నిర్వహణ కూడా రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారనుంది. టోక్యో నగరం ముఖ్యంగా ఒలింపిక్‌ క్రీడా గ్రామం నుంచి భారీ ఆదాయాన్ని ఆశించింది. ఆటలు ముగిశాక వాటిని లగ్జరీ అపార్ట్‌మెంట్లుగా మార్చి అమ్మ కానికి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అనేక మంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అవన్నీ సందేహంలో పడతాయి. వాయిదా అంటే ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. మెగా ఈవెంట్‌ కోసం నిర్వాహకులు ఇప్పటికే 45 లక్షల టికెట్లు అమ్మారు. వీరికి డబ్బులు తిరిగి ఇస్తారా అనేది స్పష్టత లేదు.

టోక్యోలో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్‌ కౌంట్‌డౌన్‌ గడియారం. ఈ విశ్వ క్రీడల ప్రారంభానికి మరో 479 రోజులు ఉన్నాయి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top