కొట్టేసి... పట్టేశారు | India vs New Zealand, 3rd ODI, highlights: IND beat NZ by 6 runs, win series 2-1 | Sakshi
Sakshi News home page

కొట్టేసి... పట్టేశారు

Oct 30 2017 2:38 AM | Updated on Oct 17 2018 4:43 PM

India vs New Zealand, 3rd ODI, highlights: IND beat NZ by 6 runs, win series 2-1  - Sakshi

సిరీస్‌ చేజిక్కింది కానీ... కివీస్‌ కడదాకా పోరాడింది. ఓవరాల్‌గా 668 పరుగులు నమోదైన గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో భారత్‌ ఆరు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌ ప్రతాపంలోనూ  భారత బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారుతున్న స్టేడియంలో 32 డాట్‌ బాల్స్‌ వేశాడు. 3 వికెట్లు తీసి రోహిత్, కోహ్లిల సెంచరీలను గెలిపించాడు.  

కాన్పూర్‌: చివరి ఓవర్‌దాకా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లి సేన 2–1తో నెగ్గింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 147; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (106 బంతుల్లో 113; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో కదంతొక్కారు. మొదట భారత్‌ నిర్ణీ త 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సౌతీ, మిల్నే, సాన్‌ట్నర్‌ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసి ఓడింది. మున్రో (62 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), లాథమ్‌ (52 బంతుల్లో 65; 7 ఫోర్లు), విలియమ్సన్‌ (84 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో పోరాడారు. బుమ్రాకు 3, చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు... కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కాయి.  

ధావన్‌ వైఫల్యం... 
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, ధావన్‌ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ధావన్‌ (14) నిష్క్రమించాడు.  కెప్టెన్‌ కోహ్లి జతగా రోహిత్‌ దూకుడుగా ఆడాడు.  వీరిద్దరూ ఓవర్‌కు 5 రన్‌రేట్‌ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా రోహిత్‌ అదుపు తప్పిన బంతుల్ని బౌండరీలకు చేర్చాడు. మిల్నే వేసిన పదో ఓవర్లో రోహిత్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన భారీ సిక్సర్‌తో భారత్‌ స్కోరు అర్ధసెంచరీ దాటింది.  

భారీ భాగస్వామ్యం... 
ఈ క్రమంలో మొదట రోహిత్‌ 52 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 19వ ఓవర్లో భారత్‌ స్కోరు 100కు చేరింది. ఇద్దరు సమన్వయంతో పరుగులు జతచేయడంతో కివీస్‌ బౌలర్లు అలసిపోయారు. సాన్‌ట్నర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 28వ ఓవర్లో రోహిత్‌ భారీ సిక్స్‌ బాదాడు. ఈ క్రమంలో అతను సెంచరీకి చేరువకాగా... సాన్‌ట్నర్‌ వేసిన తన మరుసటి ఓవర్లో బౌండరీతో కోహ్లి (59 బంతుల్లో, 3ఫోర్లు) ఫిఫ్టీ పూర్తయింది. అదే ఓవర్లో రోహిత్‌ కూడా ఫోర్‌ కొట్టాడు.

కాసేపటికే అతను (106 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 15వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ వేగం పెంచాడు. బౌల్ట్‌ వేసిన 36వ ఓవర్లో కోహ్లి ఒక ఫోర్‌ కొట్టగా... రోహిత్‌ మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాత గ్రాండ్‌హోమ్‌ ఓవర్లో ఇద్దరు ఫోర్లతో మరో 14 పరుగులు పిండుకున్నారు. చాలా ఆలస్యంగా సాన్‌ట్నర్‌ బౌలింగ్‌లో కోహ్లి  తొలి సిక్సర్‌ బాదాడు. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం 200 దాటింది.

కోహ్లి సెంచరీ దిశగా... రోహిత్‌ 150 వైపు కదం తొక్కుతుండగా... ఓపెనర్‌ రోహిత్‌ను 43వ ఓవర్లో సాన్‌ట్నర్‌ ఔట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 230 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన పాండ్యా (8) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. ధోని అండతో కోహ్లి (96 బంతుల్లో; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తయింది. 47వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులను దాటింది. స్కోరును పెంచే క్రమంలో మొదట కోహ్లి తర్వాత ధోని (17 బంతుల్లో 25; 3 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) స్వల్పవ్యవధిలో ఔటయ్యారు.  

కడదాకా పోరాటమే... 
కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ తొలి ఓవర్‌లోనే దీటుగా బదులిచ్చింది. భువీ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో మున్రో వరుసగా 6, 4, 4, 4 బాదేశాడు. ఒక ఓవర్‌ ముగిసేసరికే కివీస్‌ స్కోరు 19. ధాటిగా మొదలైన ఇన్నింగ్స్‌కు బుమ్రా... గప్టిల్‌ (10) వికెట్‌తో షాకిచ్చాడు. తర్వాత వచ్చిన విలియమ్సన్‌ అండతో మున్రో యథేచ్చగా బ్యాటింగ్‌ చేశాడు. ఇద్దరు ఓవర్‌కు 6 రన్‌రేట్‌తో  ఇన్నింగ్స్‌ను నడిపించారు. మున్రో 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, న్యూజిలాండ్‌ 15వ ఓవర్లోనే 100 పరుగులను అందుకుంది.

విలియమ్సన్‌ (59 బంతుల్లో; 8 ఫోర్లు) కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించాక జట్టు స్కోరు 153 వద్ద మున్రో, 168 స్కోరు వద్ద విలియమ్సన్‌ నిష్క్రమించారు. ఆ తర్వాత లాథమ్, టేలర్‌ (39; 3 ఫోర్లు) జట్టు బాధ్యతను తీసుకున్నారు. వీళ్లిద్దరు రన్‌రేట్‌ మందగించకుండా ఆడారు. జట్టు స్కోరు 247 వద్ద కీలకమైన టేలర్‌ వికెట్‌ను బుమ్రా, ఆ తర్వాత మెరుపు వేగంతో ఆడుతున్న నికోల్స్‌ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)ను భువనేశ్వర్‌ పడగొట్టడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. కివీస్‌ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా బుమ్రా 8 పరుగులే ఇచ్చి సాన్‌ట్నర్‌ (9) వికెట్‌ తీశాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌:
రోహిత్‌ శర్మ (సి) సౌతీ (బి) సాన్‌ట్నర్‌ 147; ధావన్‌ (సి) విలియమ్సన్‌ (బి) సౌతీ 14; కోహ్లి (సి) విలియమ్సన్‌ (బి) సౌతీ 113; పాండ్యా (సి) సౌతీ (బి) సాన్‌ట్నర్‌ 8; ధోని (సి) మున్రో (బి) మిల్నే 25; జాదవ్‌ (సి) గప్టిల్‌ (బి) మిల్నే 18; కార్తీక్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 337. 

వికెట్ల పతనం:
1–29, 2–259, 3–273; 4–302, 5–331, 6–337. 

బౌలింగ్‌:
సౌతీ 10–0–66–2, బౌల్ట్‌ 10–0–81–0, మిల్నే 10–0–64–2, గ్రాండ్‌హోమ్‌ 8–0–57–0, సాన్‌ట్నర్‌ 10–0–58–2, మున్రో 2–0–10–0. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌:
గప్టిల్‌ (సి) కార్తీక్‌ (బి) బుమ్రా 10; మున్రో (బి) చహల్‌ 75; విలియమ్సన్‌ (సి) ధోని (బి) చహల్‌ 64; టేలర్‌ (సి) జాదవ్‌ (బి) బుమ్రా 39; లాథమ్‌ రనౌట్‌ 65; నికోల్స్‌ (బి) భువనేశ్వర్‌ 37; గ్రాండ్‌హోమ్‌ నాటౌట్‌ 8; సాన్‌ట్నర్‌ (సి) ధావన్‌ (బి) బుమ్రా 9; సౌతీ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 331. 

వికెట్ల పతనం:
1–44, 2–153, 3–168, 4–247, 5–306, 6–312, 7–326. 

బౌలింగ్‌:
భువనేశ్వర్‌ 10–0–92–1, బుమ్రా 10–0–47–3, పాండ్యా 5–0–47–0, అక్షర్‌ పటేల్‌ 7–0–40–0, జాదవ్‌ 8–0–54–0, చహల్‌ 10–0–47–2. 

7
గతేడాది జూన్‌ నుంచి భారత్‌ వరుసగా నెగ్గిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల సంఖ్య. జింబాబ్వే (3–0), న్యూజిలాండ్‌ (3–2), ఇంగ్లండ్‌ (2–1), విండీస్‌ (3–1), శ్రీలంక (5–0), ఆస్ట్రేలియా (4–1), న్యూజిలాండ్‌ (2–1)లపై వరుసగా సిరీస్‌లను నెగ్గింది.

4
రోహిత్, కోహ్లి జోడీ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం నాలుగోసారి. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జోడీ ఇదే.  

20
అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా కోహ్లి చేసి సెంచరీల సంఖ్య. పాంటింగ్‌ (41), స్మిత్‌ (దక్షిణాఫ్రికా, 33) ముందు వరుసలో ఉన్నారు.

1460
ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో కెప్టెన్‌గా కోహ్లి చేసిన పరుగులివి. పాంటింగ్‌ (2007లో 1424) రికార్డును తుడిచిపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement