పట్టు దొరికింది... | India v South Africa: Ravichandran Ashwin spearheads fightback | Sakshi
Sakshi News home page

పట్టు దొరికింది...

Nov 7 2015 1:17 AM | Updated on Sep 3 2017 12:08 PM

పట్టు దొరికింది...

పట్టు దొరికింది...

రెండొందల స్కోరు చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా అదే కొండంత అన్న భారత బ్యాటింగ్ కోచ్ మాటే నిజమైంది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 125/2
{పస్తుత ఆధిక్యం 142
  తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 184 ఆలౌట్
అశ్విన్‌కు 5 వికెట్లు, రాణించిన పుజారా


 రెండొందల స్కోరు చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా అదే కొండంత అన్న భారత బ్యాటింగ్ కోచ్ మాటే నిజమైంది. చివరకు అతి స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యంతో మన జట్టు మానసికంగా పైచేయి సాధించింది.
 
 స్వదేశంలో ఎప్పుడూ నమ్మకాన్ని వమ్ము చేయని అశ్విన్ మరో సారి తన స్పిన్‌తో సఫారీల పని పట్టాడు. తనదైన శైలిలో మళ్లీ ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని కట్టి పడేశాడు. డివిలియర్స్ దక్షిణాఫ్రికాను ఆదుకున్నా... అది కొద్ది సేపే.
 
 నాటకీయంగా సాగిన మొదటి రోజు తర్వాత మొహాలి పిచ్ కాస్త శాంతించింది. దాంతో మన బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు. ఇప్పటికే చెప్పుకోదగ్గ ఆధిక్యం చేతిలో ఉండటంతో రెండో రోజే పట్టు దక్కించుకున్న కోహ్లిసేన లక్ష్యం... ఇక విజయమే.
 
 మొహాలి: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొందరగానే కోలుకుంది. రెండో రోజు ఆటలో ముందుగా దక్షిణాఫ్రికాను తక్కువ స్కో రుకే పరిమితం చేసిన కోహ్లి సేన... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించి మ్యాచ్‌ను శాసించే దిశగా పునాది వేసుకుంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (100 బంతుల్లో 63 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (11 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. విజయ్ (105 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ధావన్ (0) మళ్లీ విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ ప్రస్తుతం 142 పరుగుల ముందంజలో ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 28/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు స్పందించిన ఈ పిచ్‌పై భారత్‌లాగే సఫారీ జట్టు కూడా సరిగ్గా 68 ఓవర్లే ఆడటం విశేషం. ఏబీ డివిలియర్స్ (83 బంతుల్లో 63; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఆమ్లా (97 బంతుల్లో 43; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.  అశ్విన్ (5/51) ప్రత్యర్థిని దెబ్బ తీయగా జడేజాకు 3 వికెట్లు దక్కాయి.

 స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 201; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) జడేజా (బి) అశ్విన్ 37; వాన్ జిల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 5; డు ప్లెసిస్ (బి) జడేజా 0; ఆమ్లా (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 43; డివిలియర్స్ (బి) మిశ్రా 63; విలాస్ (సి) జడేజా (బి) అశ్విన్ 1; ఫిలాండర్ (సి) రహానే (బి) జడేజా 3; హార్మర్ (ఎల్బీ) (బి) మిశ్రా 7; స్టెయిన్ (స్టంప్డ్) సాహా (బి) జడేజా 6; రబడ (నాటౌట్) 1; తాహిర్ (సి) పుజారా (బి) అశ్విన్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (68 ఓవర్లలో ఆలౌట్) 184.

 వికెట్ల పతనం: 1-9; 2-9; 3-85; 4-105; 5-107; 6-136; 7-170; 8-179; 9-179; 10-184.

 బౌలింగ్: అశ్విన్ 24-5-51-5; ఉమేశ్ 6-1-12-0; ఆరోన్ 8-1-18-0; జడేజా 18-0-55-3; మిశ్రా 12-3-35-2.

 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) (సబ్) బవుమా (బి) తాహిర్ 47; ధావన్ (సి) డివిలియర్స్ (బి) ఫిలాండర్ 0; పుజారా (బ్యాటింగ్) 63; కోహ్లి (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (40 ఓవర్లలో 2 వికెట్లకు) 125.

 వికెట్ల పతనం: 1-9; 2-95.

 బౌలింగ్: ఫిలాండర్ 7-0-17-1; హార్మర్ 10-3-28-0; ఎల్గర్ 7-1-34-0; తాహిర్ 8-0-33-1; రబడ 8-5-9-0.
 
 తొలి సెషన్: కీలక భాగస్వామ్యం
 రెండో రోజు బౌలింగ్‌ను భారత్ నేరుగా స్పిన్నర్ మిశ్రాతోనే ప్రారంభించగా, ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (123 బంతుల్లో 37; 2 ఫోర్లు), ఆమ్లా కొద్ది సేపు పోరాడే ప్రయత్నం చేశారు. చివరకు ఓపిక నశించిన ఎల్గర్, అశ్విన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి అవుట్ కావడం 76 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 7 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో డివిలియర్స్ ఇచ్చిన క్యాచ్‌ను సాహా వదిలేయగా రీబౌండ్‌లో స్లిప్‌లో కోహ్లి పట్టేశాడు. అయితే అది నోబాల్ కావడంతో ఏబీ బతికిపోయాడు. అంత వరకు జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన ఆమ్లా అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లోనే అనూహ్యంగా స్టంప్ అవుట్ అయ్యాడు. డ్రైవ్ చేసేందుకు ఆమ్లా ముందుకు రాగా...బంతి సాహా ఛాతీకి తగిలి వికెట్లపై పడింది. మరో నాలుగు బంతుల తర్వాత అశ్విన్, విలాస్ (1)ను కూడా అవుట్ చేశాడు.  
 ఓవర్లు: 29, పరుగులు: 99, వికెట్లు: 3 (దక్షిణాఫ్రికా)
 
 అశ్విన్ రికార్డు
  ఈ మ్యాచ్‌తో అశ్విన్ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 29 టెస్టుల్లోనే ఈ రికార్డును చేరుకున్న అశ్విన్ తద్వారా భారత్ తరఫున వేగవంతంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌లోనే అతను 100 వికెట్లు తీశాడు. ఓపెనింగ్ బౌలర్‌గా కూడా 12 టెస్టుల్లోనే 50 వికెట్లు తీయడం విశేషం.
 
 ‘పరుగులు రాకపోతే బ్యాటింగ్ వైఫల్యాన్ని తప్పు పట్టండి తప్ప పిచ్‌ను కాదు. జొహన్నెస్‌బర్గ్‌కు వెళ్లి మేం పచ్చిక ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేయలేదుగా. అయినా ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్టే. మా బ్యాట్స్‌మెన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన షాట్లతో నేనూ ఆశ్చర్యపోయా. ఆమ్లాను అవుట్ చేసిన బంతి నాకు సంతృప్తినిచ్చింది. డివిలియర్స్ కోసం పక్కా వ్యూహంతో సిద్ధమయ్యా. అతని వికెట్ నాకే దక్కుతుందని అనిపించింది’                          -అశ్విన్
 
 రెండో సెషన్: డివిలియర్స్ పోరాటం
 లంచ్ తర్వాత ఫిలాండర్ (3)ను అవుట్ చేసి జడేజా సఫారీల పతనానికి శ్రీకారం చుట్టాడు. మరో వైపు పిచ్‌ను లెక్క చేయకుండా చక్కటి షాట్లు ఆడిన డివిలియర్స్ 63 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తక్కువ వ్యవధిలో దక్షిణాఫ్రికా మరో రెండు వికెట్లు కోల్పోయింది. చివరకు మిశ్రా అద్భుత బంతితో డివిలియర్స్‌ను బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే తాహిర్ (4) తన ఐదో వికెట్‌గా అవుట్ చేసి అశ్విన్ భారత్‌కు ఆధిక్యం అందించాడు.  తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది విజయ్ రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. అయితే ధావన్ (0) మరోసారి నిరాశ పరుస్తూ రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
 ఓవర్లు: 19, పరుగులు: 57, వికెట్లు: 5 (దక్షిణాఫ్రికా) ఓవర్లు: 7, పరుగులు: 13, వికెట్లు: 1 (భారత్)
 
 మూడో సెషన్: పుజారా అర్ధ సెంచరీ
 విరామం తర్వాత విజయ్, పుజారా చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ కొనసాగించారు. తొలి రోజుతో పోలిస్తే ఈ సమయంలో ఒక్కసారిగా మారినట్లు కనిపించిన పిచ్‌పై వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. తొలి ఇన్నింగ్స్ హీరో ఎల్గర్ బౌలింగ్ ఈ సారి పని చేయకపోగా...ఇతర బౌలర్లు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. గజ్జల్లో గాయంతో స్టెయిన్ బౌలింగ్ చేయకపోవడం కూడా సఫారీలను కాస్త బలహీన పర్చింది. అయితే క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత విజయ్ వికెట్ చేజార్చుకున్నాడు. తాహిర్ బౌలింగ్‌లో షార్ట్‌లెగ్‌లో బవుమా అద్భుత క్యాచ్ పట్టడంతో 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం 93 బంతుల్లో పుజారా హాఫ్ సెంచరీ పూర్తయింది. ఆరు చక్కటి బౌండరీలు కొట్టిన పుజారా తాహిర్ వేసిన ఆఖరి ఓవర్లో సిక్సర్ బాదడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది.
 ఓవర్లు: 33, పరుగులు: 112, వికెట్లు: 1 (భారత్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement