భారీ లక్ష్యం.. విరాట్‌ సేన ఛేదించేనా?

India set 338 after Stokes blitz - Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 338 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బెయిర్‌ స్టో(111; 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించగా బెన్‌ స్టోక్స్‌(79‌; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌(66;57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. వారికి తోడు జో రూట్‌(44; 54 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించింది.  భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటాడు. ఇంగ్లండ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో షమీ కీలక వికెట్లు సాధించాడు. అతనికి జతగా బుమ్రా, కుల్దీప్‌లు తలో వికెట్‌ తీశారు.(ఇక్కడ చదవండి: షేక్‌ చేసిన షమీ)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు చేలరేగి ఆడారు. ఈ జోడి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత జేసన్‌ రాయ్‌(66) ఔటయ్యాడు.  కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రాయ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తరుణంలో బెయిర్‌ స్టో-జోరూట్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే బెయిర్‌ స్టో సెంచరీ నమోదు చేశాడు. కాగా, బెయిర్‌ స్టో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.(చహల్‌ చెత్త రికార్డు)

ఆపై మరో రెండు పరుగుల వ్యవధిలో ఇయాన్‌ మోర్గాన్‌(1) కూడా ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 207 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో బెన్‌ స్టోక్స్‌- జో రూట్‌ల జోడి ఇన్నింగ్స్‌ నడిపించింది. వీరిద్దరూ 50 పరుగులు జత చేసిన తర్వాత జో రూట్‌ నాల్గో వికెట్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక జోస్‌ బట్లర్‌(20), క్రిస్‌ వోక్స్‌(7)లు నిరాశపరిచినా, స్టోక్స్‌ చివరి ఓవర్‌ వరకూ క్రీజ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మరి, బ్యాటింగ్‌లో బలంగా ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదిస్తుందా అనేది చూడాలి. (బెయిర్‌ స్టో శతక్కొట్టుడు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top