షేక్‌ చేసిన షమీ..

India fight back after Shami Attack - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత బౌలింగ్‌ యూనిట్‌లో మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లపై నాలుగేసి వికెట్లు చొప్పున సాధించి భారత విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ సాధించి ఊపు మీద ఉన్న బెయిర్‌ స్టో(111)ను ఔట్‌ చేసిన షమీ...ఆపై ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(1) సైతం బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్‌ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో కీలకమైన రెండు వికెట్లు తీసి ఆ జట్టును ఒక్కసారిగా షేక్‌ చేశాడు.  ఇన్నింగ్స్‌ 32 ఓవర్‌ నాల్గో బంతికి బెయిర్‌ స్టోను పెవిలియన్‌కు పంపగా, 34 ఓవర్‌ నాల్గో బంతికి మోర్గాన్‌ వికెట్‌ తీశాడు.  అదే సమయంలో ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించడం మరో విశేషం.

దాంతో ఇంగ్లండ్‌ స్కోరు ఒక్కసారిగా మందగించింది. షమీ ఎటాక్‌తో 31 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ మాత్రమే కోల్పోయి 204 పరుగులు చేసిన ఇంగ్లండ్‌..మరో ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేయకల్గింది. అంటే 37 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అంతకుముందు తొలి వికెట్‌గా జేసన్‌ రాయ్‌(66) ఔటయ్యాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో రాయ్‌ పెవిలియన్‌ చేరాడు.


 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top