టీమిండియా బౌలర్లు రాణిస్తేనే.. | IND Vs AUS: Team India Set Target Of 256 Runs Against Australia | Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలర్లు రాణిస్తేనే..

Jan 14 2020 5:32 PM | Updated on Jan 14 2020 6:09 PM

IND Vs  AUS: Team India Set Target Of 256 Runs Against Australia - Sakshi

ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 256 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(74; 91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌(47; 61 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా, రిషభ్‌ పంత్‌(28; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా(25; 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఫర్వాలేదనిపించడంతో భారత్‌  గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో భారత బ్యాటింగ్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన అద్భుతమైన బంతికి కాస్త తడబడ్డ రోహిత్‌ దాన్ని షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఇచ్చాడు.  ఆ తరుణంలో ధావన్‌కు జత కలిసిన రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్‌ స్కోరును ముందుకు నడిపించారు.  ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, ధావన్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

ధావన్‌ 66  బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, ధావన్‌ జోరు మీద ఉన్న సమయంలో మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్‌ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.   కేఎల్‌ రాహుల్‌(47) ఔటైన తర్వాత నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి.. ఆడమ్‌ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్‌ డ్రైవ్‌ కొట్టబోయి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్‌ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్‌ చేద్దామనుకునే వికెట్‌ను సమర్పించుకున్నాడు. కోహ్లి 16 పరుగుల కొట్టి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(4) ఔట్‌ కావడంతో భారత్‌ 164 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. 20 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది.(ఇక్కడ చదవండి: ఈసారి ‘సెంచరీ’ లేదు!)

ఆ తరుణంలో పంత్‌-జడేజాలు మరమ్మత్తుల చేపట్టారు. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత జడేజా ఔట్‌ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో పంత్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. చివర్లో కుల్దీప్‌ యాదవ్‌(17; 15 బంతుల్లో 2ఫోర్లు), మహ్మద్‌ షమీ(10)లు కాస్త ప్రతి ఘటించడంతో భారత్‌ 250 పరుగుల  మార్కును దాటింది. చివరి ఓవర్‌ ఆఖరి బంతిని షమీ షాట్‌ ఆడే క్రమంలో ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ మూడు వికెట్లు సాధించగా, కమిన్స్‌, రిచర్డ్‌సన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఆడమ్‌ జంపా, ఆగర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.  256 పరుగుల టార్గెట్‌ను భారత్‌ కాపాడుకోవాలంటే బౌలర్లు రాణించాల్సి ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన ఆసీస్‌ దెబ్బ కొట్టాలంటే టీమిండియా పేసర్లు బుమ్రా, షమీలు చెలరేగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement