విడాకులు తీసుకోనున్న ఆసీస్‌ మాజీ సారథి

Former Australian captain Michael Clarke Announce Divorce - Sakshi

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వివాహ బంధానికి ముగింపు పలికాడు.

సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వివాహ బంధానికి ముగింపు పలికాడు. తాము త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టుగా క్లార్క్‌, కైలీ దంపతులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత.. స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా, 2012లో మాజీ మోడల్‌, టీవీ ప్రజెంటర్‌ కైలీతో క్లార్క్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉన్నారు. 

ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ.. తమ కుమార్తెను ఇద్దరం చూసుకోవడానికి కట్టుబడి ఈ నిర్ణయానికి వచ్చామని క్లార్క్‌ దంపతులు చెప్పారు. అలాగే తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే క్లార్క్, కైలీ దంపతులు కోర్టు వెలుపలే తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 5 నెలల కిత్రం క్లార్క్‌ దంపతులు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కైలీ ఆ వార్తలను ఖండించారు. తమ బంధం బలంగా ఉందని తెలిపారు.

కైలీతో పెళ్లికి ముందు మోడల్‌ లారా బింగిల్‌తో క్లార్క్‌కు నిశ్చితార్థం జరిగింది. కానీ వారిద్దరు 2010లో విడిపోయారు. ఆ తర్వాత బింగిల్‌.. నటుడు, అవతార్‌ హీరో సామ్ వర్తింగ్టన్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. 2011లో రికీ పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్‌ ఆసీస్‌ క్రికెట్‌ జట్టును నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్‌ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనంతరం క్లార్క్‌ క్రికెట్‌ గుడ్‌ బై చెప్పాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top