
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయిన తరువాత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై మాజీ కెప్టెన్ గంగూలీ మండిపడుతున్నాడు.
ముంబై: ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయిన తరువాత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే సిరీస్ ఓటమికి రవిశాస్త్రినే పూర్తి బాధ్యత వహించాలంటూ విమర్శలు గుప్పించిన గంగూలీ.. గతంలో కోచ్ ఎంపికకు సంబంధించి జరిగిన గందరగోళాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసినప్పుడే రాహుల్ ద్రవిడ్‌ను విదేశాల్లో టీమిండియా బ్యాటింగ్ సలహాదారుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ద్రవిడ్ ఈ పదవి చేపట్టలేదు. దాని గురించి గంగూలీ ఇప్పుడు వెల్లడించాడు.
‘టీమిండియా రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసినప్పుడు విదేశాల్లో బ్యాటింగ్ సలహాదారుగా ఉండాలని ద్రవిడ్‌ను అడిగాం. అందుకు అతను అంగీకరించాడు. రవిశాస్త్రితో రాహుల్ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కోచ్ ఎంపిక సమయంలో క్రికెట్ పాలకుల కమిటీ సైతం గందరగోళానికి తెరతీసింది. ఆ తర్వాత దాని సంగతి వదిలేశాం. అందుకే ద్రవిడ్ ఎందుకు బ్యాటింగ్ సలహాదారు కాలేదంటే చెప్పడం నాకు కష్టం. అయితే విరాట్‌ను సంప్రదించిన తర్వాత రవిశాస్త్రి ఆ బాధ్యత తీసుకుంటే అతడు వందశాతం ఆ పనిచేసి తీరాలి. జట్టు ప్రదర్శన మెరుగయ్యేందుకు బాధ్యత వహించాలి’ అని గంగూలీ అన్నాడు.