డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

DLS Method Should Be Included in The CBSE Class 10 Syllabus - Sakshi

వర్షం అంతరాయంపై పేలుతున్న జోక్స్‌

మాంచెస్టర్‌:  డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) అంశాన్ని సీబీఎస్‌ఈ పదవ తరగతి పాఠ్యాంశాల్లో భాగం చేయాలని క్రికెట్‌ అభిమానులు ఐసీసీని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ తొలి మెగాసమరానికి వరుణ దేవుడు అడ్డు పడిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన భారత్, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యచ్‌లో ఒక ఇన్నింగ్సూ పూర్తిగా ముగియకుండానే ఆటకు అంతరాయం కలిగింది. సుదీర్ఘ సమయం పాటు వర్షం కురువడంతో అంపైర్లు ఆటను రిజర్వ్‌డే(బుధవారం)కు వాయిదావేశారు. ఈ నేపథ్యంలో వర్షం అంతరాయంపై తీవ్ర అసహనానికి గురైన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేల్చుతున్నారు.

ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మైదానంలో నిలిచిన సమయం కన్నా వర్షమే ఎక్కువ సేపు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐసీసీ క్రికెట్‌ మైదాన నిర్మాణాలను మర్చాలని, ఇండోర్‌ స్టేడియంలా నిర్మించాలని కామెంట్‌ చేస్తున్నారు. ఇక వివాదాస్పద డీఎల్‌ఎస్‌ పద్దతి ఎవరికీ అర్థం కాదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిలు పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. పూర్తిగా ఒక జట్టుకు మేలు చేకూర్చే విధంగా ఉండే ఈ పద్దతిని మార్చాలనే డిమాండ్‌ కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని అభిమానులు ఐసీసీపై సెటైర్లు వేస్తున్నారు. 

ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (85 బంతుల్లో 67 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్‌ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top