‘బౌలౌట్‌’ విజయం.. పూర్తి క్రెడిట్‌ అతడికే!

Dhonis Smartness Helped India 2007 Bowl Out Against Pakistan Says Uthappa - Sakshi

హైదరాబాద్‌: టీ20 ప్రపంచకప్‌-2007లో భాగంగా లీగ్‌దశలో పాకిస్తాన్‌పై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేక విజయాన్ని టీమిండియా నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడనిది.. ప్రస్తుత క్రికెట్‌లోనూ కనిపించని ‘బౌలౌట్‌’ అనే కొత్త విధానంతో ధోని నాయకత్వంలోని అప్పటి యువ భారత జట్టు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, వెటరన్‌ క్రికటెర్‌ రాబిన్‌ ఊతప్ప ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా  ఆ జ‌ట్టు నిర్వ‌హించిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. 

‘బౌలౌట్‌ విజయం ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి. పాక్‌పై ఈ విధానంతో గెలిచామంటే పూర్తి క్రెడిట్‌ అప్పటి సారథి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనికే దక్కుతుంది. ఎందుకంటే టోర్నీ ఆరంభానికి ముందు ధోని అందరిచేత ‘బౌలౌట్‌’ ప్రాక్టీస్‌ చేయించాడు. అంతేకాకుండా మ్యాచ్‌ టై అయి ఫలితం కోసం బౌలౌట్‌కు వెళ్లినప్పుడు వికెట్ల వెనకాల ధోని చేసిన కీపింగ్‌ విధానం వెరీవెరీ స్పెషల్‌ అని చెప్పాలి. పాక్‌ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ రెగ్యులర్‌గా వికెట్ల వెనకాల నిల్చుంటే.. ధోని మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చొని ఉన్నాడు. దీంతో మేము ధోనిని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్‌ చేసి సులువుగా స్టంప్స్‌ పడగొట్టాము. అందుకే ఆ విజయం క్రెడిట్‌ ధోనికే దక్కుతుంది’ అని ఊతప్ప వ్యాఖ్యానించాడు.   

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌-పాక్‌ జట్ల స్కోర్లు సమమవ్వడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. అంపైర్లు బౌలౌట్‌ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్‌, ఊతప్ప, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌సింగ్‌ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్‌ జట్టు ఉమర్‌గుల్‌, సోహైల్‌ తన్వీర్‌, అరాఫత్‌, షాహిద్‌ అఫ్రిది, అసిఫ్‌లను ఎంచుకుంది. తొలి బంతిని సెహ్వాగ్‌ బౌల్డ్‌ చేయగా పాక్‌ బౌలర్‌ అరాఫత్‌ మిసయ్యాడు. రెండో బంతిని హర్భజన్‌సింగ్‌ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ఉమర్‌గుల్‌ వేసిన రెండో బంతి సైతం వికెట్లను తాకలేదు. రాబిన్‌ ఊతప్ప మూడో బంతిని బౌల్డ్‌ చేయగా షాహిద్‌ అఫ్రిదీ దాన్ని కూడా వృథా చేశాడు. దీంతో ఒక్కసారిగా ధోనీసేనతో పాటు యావత్‌ భారత దేశం గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.


చదవండి:
'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'
'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top