ఎంఎస్‌ ధోని ఫామ్‌పైనే చర్చ..! | Dhoni Numbers reveal poor strike rate, poor average harming India | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ ధోని ఫామ్‌పైనే చర్చ..!

Jan 14 2019 4:23 PM | Updated on May 29 2019 2:38 PM

Dhoni Numbers reveal poor strike rate, poor average harming India - Sakshi

న్యూఢిల్లీ: ఎంఎస్‌ ధోని.. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన కెప్టెన్లలో ఒకడు. భారత క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఇప్పటికీ ధోని ముందు వరుసలోనే ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. ప్రధానంగా భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌(టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌)లు అందించిన ఏకైక సారథి ఎంఎస్‌ ధోని. అటు కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సాధించిన ధోని.. ఇటు కీపర్‌గా కూడా తనదైన ముద్రను  వేశాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. దాదాపు 11 నెలల తర్వాత వన్డేల్లో అర్థ శతకాన్ని సాధించి తనపై వస్తున్నవిమర్శలకు జవాబు చెప్పాడు. భారత జట్టు నాలుగు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ధోని బాధ్యతాయుతంగా ఆడాడు.  ఈ మ్యాచ్‌లో 53. 12 స్ట్రైక్‌రేట్‌తో 96 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కీలక సమయంలో ధోని ఆడినప్పటికీ అతని ఆడిన విధానం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా స్టైక్‌ రొటేట్‌ చేయడంలో ధోని విఫలమవుతుండటమే ఇందుకు కారణం.

గతేడాది కాలంగా చూస్తే ధోని యావరేజ్‌ 27.16గా ఉంది.  2018, జనవరి నుంచి 21 మ్యాచ్‌లకు గాను 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని 326 పరుగులు చేశాడు. అయితే ఇక్కడ ధోని ఆడిన ఇన్నింగ్స్‌లకు, చేసిన పరుగులకు భారీ వ్యత్యాసం ఉంది. ఇది కనీసం  మిడిల్‌ ఆర్డర్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన భారత్‌ ఆటగాళ్ల పరంగా చూస్తే రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాల కంటే మాత్రమే కాస్త ఎక్కువగా ఉంది. జడేజా ఐదు ఇన‍్నింగ్స్‌ల్లో 19.00 సగటుతో 76 పరుగులు చేయగా, పాండ్యా 6 ఇన్నింగ్స్‌ల్లో 13.60 యావరేజ్‌తో 68 పరుగులు చేశాడు. గతేడాది కాలంలో భారత మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల యావరేజ్‌ను పరిశీలిస్తే అంబటి రాయుడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 54. 25 సగటుతో 217 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో కేదర్‌ జాదవ్‌(5 ఇన్నింగ్స్‌ల్లో 87 పరుగులు) 43.50 ఉండగా, అజింక్యా రహానే( 5 ఇన్నింగ్స్‌ల్లో 140 పరుగులు) 35.00 సగటుతో ఉన్నాడు.ఇక్కడ దినేశ్‌ కార్తీక్‌(6 ఇన్నింగ్స్‌ల్లో 135 పరుగులు) 33.75 సగటుతో ధోని కంటే ముందున్నాడు.

ఈ ఆటగాళ్ల స్టైక్‌ రేట్‌ పరంగా చూస్తే ధోనినే వెనుకంజలో ఉండటం గమనార్హం. ఈ కాలంలో ధోని స్టైక్‌రేట్‌ 67.77 ఉండగా, మిగతా వారిది ధోని కంటే కాస్త బెటర్‌గా ఉంది. ఓవరాల్‌గా చూస్తే 2018, జనవరి నుంచి అత్యంత తక్కువ స్టైక్‌రేట్‌ నమోదు చేసిన 36 మంది ఆటగాళ్లలో ధోని నాల్గో స్థానంలో ఉన్నాడు. చాలా కాలంగా స్టైక్‌ను రొటేట్‌ చేయడంలో విఫలమవుతూ వస్తున్నధోని.. మరికొన్ని నెలల్లో ఆరంభం కానున్న వరల్డ్‌కప్‌లో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ మెగా ఈవెంట్‌లో ధోని ఆడటం దాదాపు ఖాయమైనప్పటికీ, భారత్‌ వరుసగా ఆడబోయే సిరీస్‌ల్లో ధోని ఆట తీరు ఎలా ఉండబోతుందనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప‍్రస్తుతం ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో సిరీస్‌ల్లో ధోని తన స్టైక్‌రేట్‌తో పాటు యావరేజ్‌ను మెరుగుపరుచుకుంటే అతని వరల్డ్‌కప్‌ స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఒకవేళ ఆయా సిరీస్‌ల్లో ధోని విఫలమైన పక్షంలో అది సెలక్టర్లకు తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement