
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘దంగల్’లో హీరో అమీర్ ఖాన్‌ను తన కూతురు ఫైనల్ బౌట్ చూడకుండా జట్టు కోచ్ ఆయనను ఓ గదిలో బంధిస్తారు. నిజంగా ఇది జరగనప్పటికీ సినీడ్రామా కోసం అలా చేశారు. స్టార్ రెజ్లర్లు గీత, బబిత ఫొగాట్ తండ్రి మహావీర్ ఫొగాట్ జీవితచరిత్ర ఆధారంగా ఆ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బంధించడం జరగలేదు కానీ... స్టేడియం వెలుపల మహావీర్ నిరీక్షించిన ఘటన గోల్ట్‌కోస్ట్‌లో జరిగింది. తన కుమార్తె తలపడుతున్న 53 కేజీల స్వర్ణ పతక బౌట్‌ను చూసేందుకు స్టేడియానికి వెళ్లిన మహావీర్ టికెట్ లేక ఆగిపోయారు. తొలి మూడు బౌట్‌లలో బబిత గెలిచినా... అది చూసే అవకాశం మాత్రం మహావీర్‌కు దక్కలేదు. చివరకు ఆస్ట్రేలియా రెజ్లర్లకు వచ్చిన టికెట్లతో ప్రవేశం పొందిన ఆయన... తన కుమార్తె ఫైనల్ ‘పట్టు’ చూడగలిగారు. టికెట్ల వ్యవహారంపై చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా మాట్లాడుతూ రెజ్లింగ్ కోచ్ తోమర్‌కు ఐదు టికెట్లిచ్చామని... అమెకు ఎందుకు అందలేదో తెలియదన్నారు.
రాత్రి దాకా ప్రయత్నించా: బబిత
‘అథ్లెట్‌కు రెండు టికెట్లిస్తారు. కానీ అవి నాకు అందలేదు. నా తండ్రికి టికెట్ ఇవ్వండని ఐఓఏ అధికారుల్ని, భారత చెఫ్ డి మిషన్‌ను అడిగా. బుధవారం రాత్రి పది గంటలదాకా నాకు ఇదే పనైంది. ఎంత చేసినా టికెట్లు అందలేదు. దీంతో స్టేడియం వెలుపలే మా నాన్న ఉండిపోయాడు. చివరకు ఆస్ట్రేలియన్ల చొరవతో ఆఖరి పోరు చూడగలిగారు. నేను చాలా నిరాశ చెందాను’ అని బబిత వాపోయింది.