కొలనులో కొట్లాట! | Broke out in the United States, Russia rivalry | Sakshi
Sakshi News home page

కొలనులో కొట్లాట!

Aug 10 2016 1:21 AM | Updated on Sep 4 2017 8:34 AM

కొలనులో కొట్లాట!

కొలనులో కొట్లాట!

ఒలింపిక్స్ వేదికపై దశాబ్దాల తర్వాత మరో సారి అమెరికా, రష్యా విభేదాలు బయట పడ్డాయి.

బయటపడిన అమెరికా, రష్యా వైరం


రియో: ఒలింపిక్స్ వేదికపై దశాబ్దాల తర్వాత మరో సారి అమెరికా, రష్యా విభేదాలు బయట పడ్డాయి. ఎప్పుడో అగ్రరాజ్యాలుగా ఉంటూ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగించిన ఈ రెండు దేశాలు క్రీడా ప్రపంచంలో కూడా ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. ఒలింపిక్స్‌లో కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య పతకాల్లో అంతరం పెరిగిపోయినా... అమెరికన్లు మాత్రం రష్యాపై తమ ఆగ్రహాన్ని దాచుకోలేకపోతున్నారు. తాజాగా స్విమ్మింగ్ పోటీల సందర్భంగా రష్యా ఆటగాళ్లను డోపీలుగా అవమానిస్తూ అమెరికన్లు వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదం రేపింది. మహిళల 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీల్లో అమెరికా స్విమ్మర్లు లిలియా, మీలీ స్వర్ణ, కాంస్యాలు గెలుచుకోగా... రష్యాకు చెందిన ఎఫిమోవాకు రజతం దక్కింది.


అయితే గతంలో డోపింగ్ కారణంగా నిషేధానికి గురైన ఎఫిమోవాకు ప్రత్యేక అనుమతితో రియోలో పాల్గొనేందుకు అవకాశం లభించింది. పోటీ ముగిశాక దీనిని గుర్తు చేస్తూ అమెరికన్లు... ఆమెపై నిషేధం కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ‘నేను తప్పేమీ మాట్లాడలేదు. అందరూ అనుకుంటున్నదే చెప్పాను. నిషేధం విధించమని చెప్పే ధైర్యం నాకుంది’ అన్న లిలియా మాటలు నీళ్లల్లో నిప్పులు పుట్టించాయి. విజయానంతరం ఒకరినొకరు కౌగిలించుకొని చిందులేసిన అమెరికా స్విమ్మర్లు, క్రీడా స్ఫూర్తితో కనీసం ఎఫిమోవాను అభినందించే ప్రయత్నం కూడా చేయలేదు.

 
ఎఫిమోవా కన్నీళ్లపర్యంతం...

జతం గెలిచాక జరిగిన పరిణామాలతో ఎఫిమోవా కు ఏడుపు ఆగలేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె తడబడుతూ వెళ్లింది. అయితే డోపింగ్‌పై ప్రశ్నలు అడగడంతో మళ్లీ కన్నీళ్లపర్యంతమైంది. ‘గతంలో నేను ఒక సారి తప్పు చేశాను. దానిని 16 నెలల శిక్ష అనుభవించాను. ఇటీవల జరిగిన డోపింగ్‌లో మాత్రం నా ప్రమేయం ఏమీ లేదు. ఎలా చెబితే అందరికీ అర్థమవుతుందో నాకు తెలియడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో అన్ని యుద్ధాలు సమసిపోతాయని అంతా అంటారని, కానీ అమెరికన్లు తమని ఓడించేందుకు కొత్త పద్ధతిని కనుకున్నారంటూ ఎఫిమోవా వాపోయింది. మరో వైపు తన అమెరికా సహచరులకు మద్దతు ఇస్తూ ‘రెండు సార్లు డోపింగ్‌కు పాల్పడి కూడా స్విమ్మింగ్‌లో పాల్గొనే అవకాశం రావడమేంటి. నాకు చాలా బాధ కలుగుతోంది’ అంటూ ఫెల్ప్స్ తన వ్యాఖ్యలతో ఈ గొడవలో మరింత అగ్గి రాజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement