రంజీల్లో ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌!

BCCI technical committee proposal - Sakshi

బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ ప్రతిపాదన

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ కొత్త మార్పులతో మన ముందుకు రాబోతుంది. భారత్‌లో అత్యున్నత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్తగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశను చేర్చేందుకు బీసీసీఐ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం కోల్‌కతాలో సమావేశమైన సౌరభ్‌ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ, సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో దేశవాళీ క్రికెట్‌ను రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ పలు ప్రతిపాదనలను సీఓఏ ముందుంచింది. రంజీల్లో ప్రస్తుతం వాడుతోన్న ఎస్‌జీ టెస్టు బంతుల స్థానంలో కూకాబురా బంతుల ఉపయోగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. రాష్ట్ర జట్ల కెప్టెన్లు అభీష్టం మేరకు రంజీల్లో ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లను నిర్వహించాలని సూచించింది.

వచ్చే ఏడాది బిహార్‌ జట్టు రంజీల్లో పునఃప్రవేశం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి మాత్రం కూకాబురా బంతులకు బదులుగా ఎస్‌జీ టెస్టు బంతుల వైపే మొగ్గు చూపారు. ఈసారి కూడా దులీప్‌ ట్రోఫీ డేనైట్‌ పద్ధతితో పింక్‌ బంతితోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో బిహార్‌ పునః ప్రవేశం చేయాలంటే నిబంధనల మేరకు జూనియర్‌ క్రికెట్‌లో రాణించాలని సీఓఏ పేర్కొంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా బిహార్‌ జట్టును రంజీల్లో అనుమతిస్తే ఆసోసియేట్‌ సంఘాలైన మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్‌ జట్లు కోర్టుకు వెళ్తాయని పేర్కొంది. విజయ్‌ హజారే జాతీయ వన్డే టోర్నీతో ఈ సీజన్‌ ప్రారంభం కానుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top