ఆ విదేశీ కెప్టెన్లే నాకు స్ఫూర్తి: బాబర్‌ అజామ్‌

Babar Azam Hoping To Emulate Kohli And Williamson - Sakshi

కరాచీ: తమకు ఆస్ట్రేలియాలో ఎదురవ్వబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పేర్కొన్నాడు. ఇటీవల సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్‌గా తొలగించి బాబార్‌ అజామ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించగా, ఆ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా మాట్లాడిన అజామ్‌... ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఢీకొట్టాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలింగే తమ ప్రధాన ఆయుధమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక  స్వదేశంలో జరిగిన శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కోల్పోవడం పట్ల అజామ్‌ అసంతప్తి వ్యక్తం చేశాడు. ‘ శ్రీలంతో టీ20 సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌గా నా ప్రదర్శన బాలేదు. ఇది అభిమానులకు తెలిసిన విషయమే. ప్రతీ ఆటగాడి కెరీర్‌లోనే ఎత్తు పల్లాలు అనేవి సహజం.

 శ్రీలంకపై మాది చాలా పేలవమైన ప‍్రదర్శన. అందులో వేరే ప్రశ్నే లేదు. నేను ఎప్పుడూ 120 శాతం ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తా. ఇప్పుడు నేను కెప్టెన్‌ అయినంత మాత్రాన నాపై అదనపు ఒత్తిడి ఉంటుందని అనుకోవడం లేదు. నా సహజ సిద్ధమైన ఆటనే ఆడతా. అప్పుడే పూర్తి స్థాయి ఆట బయటకు వస్తుంది. నాకు విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలే స్ఫూర్తి. వారిద్దరూ ఒత్తిడిలో కూడా రాణిస్తారు. ఒత్తిడిని ఎలా జయించాలో కోహ్లి, విలియమ్సన్‌లకు తెలుసు. ఆ ఇద్దరి ఆటను నేను చూస్తూ ఉంటా. ఆ ఇద్దరు తమ అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. కచ్చితంగా వారినే నేను అనుసరించడానికి ప్రయత్నిస్తా’ అని బాబర్‌ అజామ్‌ పేర్కొన్నాడు.  నవంబర్‌3వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌-ఆసీస్‌ల మధ్య తొలి టీ20తో సిరీస్‌ ఆరంభం కానుంది. అంతకుముందు అక్టోబర్‌30వ తేదీన క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో పాకిస్తాన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top