గెలిచి పరువు నిలుపుకునేనా? | Australia Set 359 Runs Target To England In 3rd Ashes Test | Sakshi
Sakshi News home page

గెలిచి పరువు నిలుపుకునేనా?

Aug 24 2019 5:27 PM | Updated on Aug 24 2019 5:35 PM

Australia Set 359 Runs Target To England In 3rd Ashes Test - Sakshi

హెడింగ్లీ : యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ లక్ష్యం 359 పరుగులు. తొలి టెస్టు ఓటమి, రెండో టెస్టు డ్రా.. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో తప్పక గెలవాలని భావించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంత భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టతరమే.  ఈ టెస్టులో ఓడిపోతే సిరీస్‌పై ఇంగ్లండ్‌ పట్టు కోల్పోతుంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య జట్టు తెగ ఆరాటపడుతోంది. 

తొలి ఇన్నింగ్స్‌ 112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 75.2 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 358 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది.  లబుషేన్‌ (80; 187 బంతుల్లో) ఒంటిరి పోరాటం చేశాడు. అతడికి మాథ్యూ వేడ్‌ (33), హెడ్‌(25) చక్కటి సహకారం అందిచినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లు స్టోక్స్‌(3/56), బ్రాడ్‌(2/52), ఆర్చర్‌(2/40)లు రాణించారు. 

రెండు రోజుల అవకాశం ఉండటంతో వికెట్లను కాపాడుకుంటే ఇంగ్లండ్‌ గెలవడం అంత కష్ట తరం కాదు. కానీ పిచ్‌ క్రమేపీ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో పరుగులు రావడం కష్టంగా మారింది. సారథి జో రూట్‌ చెత్త ఫామ్‌కు తోడు ఓపెనర్లు నిర్లక్ష్యంగా ఆడుతుండటం ఇంగ్లండ్‌ జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్యలు. ఇక మిడిలార్డర్‌ నిలకడలేమిగా ఆడుతుండటం కూడా ఇంగ్లండ్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక ఆసీస్‌ పేస్‌ అటాకింగ్‌ బలంగా ఉండటంతో విజయం ఖాయమని ఆ దేశ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0తో యాషెస్‌ సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఆసీస్‌ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 1-1తో సమం చేయాలని ఇంగ్లండ్‌ ఆరాటపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement