తమిళనాడు, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
చెన్నై: తమిళనాడు, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఏ జట్టుకూ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించకపోవడం, రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో ఇరు జట్లకూ ఒక్కో పాయింట్ దక్కింది. ఆట చివరిరోజు మంగళవారం తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులు సాధించింది. తమిళనాడు జట్టులో ఇంద్రజిత్ (43; 2 సిక్సర్లు), సతీశ్ (33; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (29; 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు.
ఆంధ్ర బౌలర్లలో సుధాకర్ రెండు వికెట్లు పడగొట్టగా... శివకుమార్, శివరాజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. తొలి రోజు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. అయితే రెండో రోజు, మూడో రోజు వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. చివరిరోజు కేవలం 37 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఇప్పటిదాకా ఆంధ్ర ఆరు మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సంపాదించగా... తమిళనాడు ఐదు మ్యాచ్‌ల ద్వారా 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌లో రైల్వేస్‌తో ఆడుతుంది.