ఆంధ్ర టి20 లీగ్‌కు సై

Andhra Cricket Association announces T20 League from June - Sakshi

జూన్‌లో టోర్నీ నిర్వహణ  

సాక్షి, విజయవాడ: బీసీసీఐ పరిధిలోని కొన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాల తరహాలోనే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కూడా తొలిసారి సొంత టి20 లీగ్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నగరాలు ఫ్రాంచైజీలుగా జూన్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు రంగరాజు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం పేర్లతో జట్లు ఉంటాయి. వన్డే వరల్డ్‌ కప్‌ జరిగే సమయంలోనే భారత్‌ మ్యాచ్‌లు ఆడని రోజుల్లో లీగ్‌ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు ఏసీఏ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిందని, మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏసీఏ కార్యదర్శి సీహెచ్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. సీనియర్‌ క్రికెటర్లతో యువ ఆటగాళ్లు కలిసి ఆడేందుకు ఇది మంచి అవకాశం ఇస్తుందని, దాదాపు వంద మంది క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆంధ్ర లీగ్‌ వేదికగా నిలుస్తుందని కూడా ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక, ముంబై ప్రీమియర్‌ లీగ్‌లు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందగా... గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా బోర్డు అనుమతితో తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించింది.   

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top