కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వండి

Congress seeks CPI support for LS polls - Sakshi

చాడకు ఉత్తమ్, కుంతియా ఫోన్లు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీచేయని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతి యా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లో సంప్రదించినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీచేయడం, మిగతా చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు మద్దతు ఇవ్వడం అనే అంశాలపై నిర్ణయం జాతీయనాయకత్వ పరిధిలో ఉందని చాడ వారికి వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఇప్పుడిక తమ చేతుల్లో ఏమీలేదని ఎన్నికల్లో అనుసరించే వైఖరికి సంబంధించి జాతీయ నాయకత్వానికి నివేదించినందున, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు తమను ఒక్కసారి కూడా పలకరించని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు సంప్రదింపులు జరపడంపట్ల సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమిలో కాంగ్రెస్, సీపీఐ కలసి పోటీ చేశాక, కనీసం ఎన్నికల ఫలితాల సమీక్షకు చొరవ తీసుకోని కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు అవసరం కావడంతో మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 

ఢిల్లీకి చేరిన లెఫ్ట్‌ పంచాయితీ... 
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల మధ్యనున్న పంచా యితీ ఢిల్లీ చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరిం చాల్సిన రాజకీయవిధానం, పోటీచేయని స్థానాల్లో ఏ పార్టీకి మద్దతునివ్వాలనే విషయంపై ఈ పార్టీల మధ్య అంగీకారం కుదరలేదు. ఈ నేపథ్యంలో పొత్తులపై ఎలాంటి వైఖరిని అవలంబించాలి, ఇరుపార్టీలు పోటీలో లేని సీట్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అం శంపై తేల్చాల్సిందిగా జాతీయ నాయకత్వాలను ఆశ్రయించినట్టు సమాచారం. ఐదు దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, వాటిపై వెల్లడైన రెండుపార్టీల అభిప్రాయాల గురించి గురువా రం కేంద్ర కమిటీకి సీపీఐ రాష్ట్ర కమిటీ లేఖ రాసింది.

సీపీఎంతో పొత్తు అంశం, తాము బరిలో లేని చోట్ల ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. తాము పోటీచేయని చోట్ల జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ (యూ), బీఎల్పీ, ఎంబీటీ వంటి పార్టీలకు మద్దతు ఇవ్వడంపై తమ నిర్ణయాన్ని జాతీయపార్టీకి సీపీఎం తెలిపినట్టు సమాచారం. గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరితో ఆయా అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బి.వెంకట్‌ నామినేషన్‌ దాఖ లు చేసే కార్యక్రమంలో ఏచూరి పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడే ఏచూరి సమక్షంలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై నిర్ణయిస్తారు.

Read latest Quote News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top