హౌ డేర్‌ యూ..!

adimulapu suredh fired on district collector - Sakshi

మాకు తెలియకుండా ప్రపోజల్స్‌ ఎలా పెడతారు?

ఎమ్మెల్యేలను మీటింగ్‌కు పిలవాలని తెలియదా

అధికారపక్ష ఎమ్మెల్యేలతోనే మీటింగ్‌ పెడతారా

దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం

ప్రివిలైజేషన్‌ కమిటీ దృష్టికి తీసుకువెళతాం

జిల్లా అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆదిమూలపు, జంకె ఆగ్రహం

ఒంగోలు టౌన్‌: ‘జిల్లాలోని సీపీడబ్ల్యూ స్కీమ్స్‌కు సంబంధించి 1000 కోట్ల రూపాయల పనులతో ప్రతిపాదనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారపక్ష ఎమ్మెల్యేలనే పిలుస్తారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవరా? తమ నియోజకవర్గాలకు తెలియకుండా పనులు ఎలా చేస్తారు. ఎమ్మెల్యే హక్కులు, గౌరవం కాలరాసే అధికారం ఎవరిచ్చారు? ఈ విషయమై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం. ప్రివిలైజేషన్‌ కమిటీ దృష్టికి తీసుకువెళతాం’ అని సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక టీటీడీసీ మీటింగ్‌ హాలులో జరిగిన డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ మీటింగ్‌ (దిశ)లో ఈమేరకు స్పందించారు. సమావేశం జరుగుతున్న పోడియం వద్ద పలువురు ఎంపీపీలతో కలిసి కొద్దిసేపు బైఠాయించారు.

ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ తమకు తెలియకుండా నియోజకవర్గంలో పనులపై ఎలా ప్రతిపాదనలు చేస్తారని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులను నిలదీశారు. ఏ పనులకు ప్రతిపాదనలు చేశారో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే అధికారులకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ మండిపడ్డారు. కనీసం తమ నియోజకవర్గంలో ఏమి ప్రతిపాదనలు పెట్టారో కూడా ఇంతవరకు చెప్పలేదని తెలిపారు. తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులకు తాము లేకుండా ఎవరి కోసం ప్రపోజల్స్‌ పెట్టారని నిలదీశారు. ఈ విషయమై రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవాలా?
మార్కాపురం శాసన సభ్యుడు జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ తన నియోజకవర్గంలో అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని ప్రారంభించినా తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. మాజీ శాసనసభ్యునితో అంగన్‌వాడీ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. లోకల్‌ ఎమ్మెల్యేని పిలవాలన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారని మండిపడ్డారు. పొదిలిలో వికలాంగులకు ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ నిర్మాణాలు తాను లేకుండా ఎలా ఇస్తారని.. మాజీ ఎమ్మెల్యేతో ఎలా ఇప్పిస్తారని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్నెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అలాంటి అధికారులను సస్పెండ్‌ చేయాలి
శాసనసభ్యులకు తెలియకుండా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న అధికారులను సస్పెండ్‌ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నెలరోజుల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారని.. ఈ విషయమై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులను సస్పెండ్‌ చేసేవరకు ధర్నాకు కూర్చోవాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మండలంలో జరిగే సమీక్ష సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదన్నారు. చినారికట్ల గ్రామ పంచాయతీ సమావేశం గత ఏడాది సెప్టెంబర్‌లో పంచాయతీ సమావేశం తేదీని ప్రకటించి, మరో తేదీలో సభ్యులు లేకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా తీర్మానాలు చేస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి జోక్యం చేసుకుంటూ మార్కాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యునికి సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా పనులు ప్రారంభించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్, హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top