
ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉచ్చరిస్తోన్న కోడికత్తి డ్రామా పదాలను పట్టుకుని పవన్ కల్యాణ్ కూడా కోడికత్తి డ్రామా అని..
విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కులం గురించి జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రస్తావించడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తప్పుబట్టారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సుధాకర్ బాబు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పవన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యవహార శైలి ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో పవన్‌కే తెలియదని, కనీసం ఆయన చేసే పనులేంటో ఇంట్లో వాళ్లకు కూడా సరిగా తెలియదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నాడు..తీరా నాలుగేళ్ల తర్వాత ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గుడ్డలు చించుకుంటూ ఆవేశంతో ఉపన్యాసాలు ఇస్తూ..చిట్టచివరికి పోటీ చేయకుండా పవన్ టీడీపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారని ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా సందర్భానుసారం మీరు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పర్యటనలు చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పర్యటనల ద్వారా మీకు ఎన్ని డబ్బుల మూటలు అందాయని సూటిగా అడిగారు. అధికారంలో ఉన్న టీడీపీని ప్రశ్నించాల్సింది పోయి, నిరంతరం ప్రజలలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జనసేనను గుంపగుత్తగా టీడీపీకి లీజుకిచ్చారని మీ చర్యల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. పవన్‌కు చంద్రబాబు నుంచి ముడుపులు ముట్టడానికి లింగమనేని మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు.
మీ పొత్తుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల రాష్ట్రానికి ఒక్క మేలు అయినా జరిగిందా అని ప్రశ్నించారు. క్యారెక్టర్ లేని వ్యక్తి పవన్ అని జనం చెప్పుకుంటున్నారని అన్నారు. పవన్, టీడీపీ ఆడమన్నట్లు ఆడటం, పాడమన్నట్లు పాడటం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకుని అవసరం తీరాక వదిలేయం అలవాటని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన యువతను రెచ్చగొట్టి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉచ్చరిస్తోన్న కోడికత్తి డ్రామా పదాలను పట్టుకుని పవన్ కల్యాణ్ కూడా కోడికత్తి డ్రామా అని విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.
చంద్రబాబు, పవన్‌లిద్దరూ తాము విడిపోయినట్లు డ్రామాలు ఆడుతూ జనాల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూములు ఉన్నాయని పవన్ ఆరోపించడం సరికాదని అన్నారు. అసైన్డ్ భూములు ఉన్నాయని తెలుసుకుని గతంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, మాట కోసం సోనియా గాంధీతోనే పోరాటం చేశారని తెలిపారు.