
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికి 8 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరాభిమానాలు చూపిస్తున్న కార్యకర్తలు, ప్రజలకు పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ.. పోరాడుతూ రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం. దీనికోసం కార్యకర్తలు చూపిస్తున్న అభిమానం, పార్టీ పట్ల విధేయతకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మద్దతు తెలుపుతున్న ఆంధ్ర ప్రజలకు నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.