
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా.. ఏలూరు మండలం వెంకటాపురం - మాదేపల్లి మధ్యలో నిర్మిస్తున్న 2000 కిలోమీటర్ల పైలాన్ పనులను శుక్రవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వినర్ కోటగిరి శ్రీధర్, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్పార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కోసం జిల్లాలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాలను గెలుచుకొని ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. పశ్చిమలోని అన్ని స్థానాలను కైవసం చేసుకొని టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజా ధనాన్ని లూఠీ చేసే పనిలో పడ్డారు. ఈసారీ చంద్రబాబుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని అన్నారు.
ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. వైఎస్ జగన్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. 14న ఏలూరు మండలం వెంకటాపురం వద్ద 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను జగన్ ఆవిష్కరిస్తారు. అదే రోజు సాయంత్రం ఆయన ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.