రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ జగన్‌

YS Jagan Calls for Andhra Pradesh Bandh on Tuesday - Sakshi

కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌

బంద్‌కు సహకరించాలని అన్ని పార్టీలకు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి

టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలి

కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ ప్రజలను మోసం చేశాయి

సాక్షి, కాకినాడ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల బలీయమైన ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను, రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా అవిశ్వాసంపై చర్చలో తమ ఎజెండాను మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాసం చర్చలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. పార్లమెంటులో ఆయా పార్టీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ముమ్మరం చేయడంలో భాగంగా మంగళవారం (ఈ నెల 24న) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ బంద్‌ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం ఆయన స్పందించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజికి అంగీకరించి, రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎవరని వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు..
‘పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా జరిగిన తీరును.. మన రాష్టం మీద పెద్దలకు ఉన్న ప్రేమను చూసి నిజంగా బాధ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్‌ పార్టీ దాకా.. మిగిలిన ఏ పార్టీలు చూసినా కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తూ మాట్లాడిన మాటలు ఒక్కరి నోటా రాలేదు. ఇది నిజంగా అన్నింటికన్నా బాధాకరమైన విషయం. పార్లమెంట్‌ సాక్ష్యంగా ఆదుకుంటామని చెప్పి అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని పార్టీలు, చంద్రబాబుతో సహా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత హామీలు నెరవేర్చకపోగా.. నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు చూస్తే ఇస్తామని కానీ, ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట కూడా రాలేదు.

తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాలేదు. ఒకవైపు ప్రధానమంత్రికి గుర్తుకురాకపోగా.. ఆయన చెప్పిన మాటల్లో బాధ కలిగించిన విషయం.. చంద్రబాబు అంగీకారంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని చెప్పడం.. ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు. రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. టాక్స్‌ మినహాయింపు , జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదు. ఈ వెసులుబాటుతో కంపెనీలు ముందుకువస్తాయి. కానీ ఇంతటి కీలకమైన విషయంలో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబులకు ఎవరిచ్చారు?’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌ ప్రసంగంలో కూడా..
మోదీ మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తే.. రాహుల్‌ గాంధీ ప్రసంగంలో కూడా అర నిమిషం కూడా ఏపీ గురించి లేదు. ఆ అర నిమిషంలో ప్రత్యేక హోదా ఇచ్చే ధర్మం తమపై ఉంది. ఇవ్వాలని అనే మాటలు కూడా ఆయన నోటి నుంచి రాలేదు. 

గల్లా మాటలు మావి కావా?
గల్లా జయదేవ్‌ ప్రసంగంలో మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్నవి కాదా? అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా గురించి మేం మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చూడండి. రికార్డ్స్‌ తిరిగేయండి. యువభేరిల్లో చూడండి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూడండి. నిరాహార దీక్షలు సందర్భంగా.. మేం మాట్లాడిన మాటలు.. గత నాలుగన్నరేళ్లుగా చెప్పిన మాటలే గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో చెప్పారు. అప్పుడు మేం ఈ మాటలు చెబితే.. మమ్మల్ని వెక్కింరించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా? అదేమన్నా సంజీవని అంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

‘ప్రజాప్రతినిధులకు ఓ అవగాహన అని అసెంబ్లీలో చంద్రబాబు ఓ పుస్తకాన్ని జారీ చేశారు. మహానాడు 2017లోనూ హోదా కలిగిన, లేని రాష్ట్రాలకు తేడా ఏముంది? తేడా లేదు. అభివృద్ధి శూన్యం. ఇది కేవలం ఉనికి కోసమే ప్రతిపక్షాలు ఆరాటమని చంద్రబాబు తీర్మానం చేయలేదా? ఆ అవగాహన బుక్‌ చూస్తే.. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు.. మహానాడులో చెప్పిన మాటలు ఇంచుమించు ఒకటే.. సెప్టెంబర్‌ 7, 2016న, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ అని చెప్పి చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేసినపుడు బాబు మంత్రులు కేంద్ర ‍ప్రభుత్వంలో లేరా? ఆ తర్వాత బాబుతో చర్చించి ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు వారు చెప్పడం.. దానికి బాబు కృతజ్ఞతలు తెలుపడం నిజం కాదా’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 2017 జనవరి 26న ప్రెస్‌ మీట్‌ పెట్టి బీజీపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగడటం.. నిజం కాదా? అంటూ ఈ విషయమై ఈనాడు పత్రికను చూపించారు. 2017 జనవరి 27 మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికి ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా చెప్పాలని ప్రతిపక్షలకు సవాల్ విసురుతున్నా.. అని చంద్రబాబు చెప్పలేదా? అని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టారు.

టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసుంటే..
ఇంతటి దారుణమైన మోసాన్ని ఎండగట్టేందుకు, ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి దేశమొత్తం తెలియజేసేందుకు బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేశారు. ఇలానే చంద్రబాబు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే దేశం మొత్తం మనవైపు చూసి ఉండేది. ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించకపోవడం ధర్మమేనా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

ఒకవైపు చంద్రబాబు బీజేపీతో యుద్ధం అంటారు. మరోవైపు ఆయన ప్రవర్తన అసలు బీజేపీతో యుద్దం చేస్తున్నాడా? అని సామాన్యుడికి కూడా సందేహం కలిగేలా ఉంటుంది. టీటీడీ బోర్డు మెంబర్‌గా బీజేపీకి చెందిన నేత భార్యను నియమించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ సందర్భంగా వెంకయ్యనాయుడు కనిపించారు. పరకాల ప్రభాకర్‌ చంద్రబాబు కొలువులో ఉంటారు. అక్కడేమో ఆయన భార్య నిర్మలా సీతారామన్‌ కేంద్ర మంత్రిగా ఉంటారు. నిన్నటి చర్చలో రాజ్‌నాథ్‌ సింగ్‌.. మా బంధం విడిపోదు’ అని చెప్పారు. ఓవైపు యుద్ధం అంటూ.. మరోవైపు చంద్రబాబు తనకు లోపాయికారి పనులు చేస్తున్నారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి.. ప్రత్యేక హోదాకు చంద్రబాబు తూట్లు పొడిచారు.  ఎన్నికలకు ఆరునెలల ముందు ఇప్పుడు విడాకులు తీసుకొని.. అది కూడా నిజాయితీగా చేయడం లేదు.

మేం అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీతో ఉన్న పరిచయాల వల్ల అది చర్చకు రాకుండా చంద్రబాబు చేశారు. ఇప్పుడు అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించండి. రాజీనామాలు చేసి 25 మంది ఎంపీలు నిరాహార దీక్షకు కూర్చుంటే.. దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో చూద్దాం. ఎంపీలు రాజీనామాలు చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్‌, బీజేపీ, చంద్రబాబు అందరూ ప్రజలను మోసం చేశారు. వీళ్లను ఎవరూ నమ్మకండి. 25 మంది వైఎస్సార్‌ సీపీ ఎంపీలను గెలిపించండి. ఎవరు హోదా ఇస్తే వారికి మద్దతు ఇద్దాం. ఏపీకి రావాల్సిన డిమాండ్లను నిజాయితీగా మా పార్టీ అడుగుతోంది’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. హోదాపై మా నిజాయితీ బీజేపీకి ట్రాప్‌లా కనిపిస్తోందా అని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తమ ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నారని, ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని తామిచ్చిన పిటషన్లు స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

హోదాకోసం వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటాలు మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి

ప్రత్యేక హోదా - వైఎస్‌ జగన్‌ యువభేరిలు ఇక్కడ చదవండి

ఏపీ ప్రత్యేక హోదా కథనాలు

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top