
సాక్షి, హైదరాబాద్ : పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ బకాయిల చెల్లింపులో జాప్యంపై వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫీస్ వద్ద రైతులతో కలసి ఆందోళన చేపట్టారు. రైతులకు పంట నష్టానికి సంబంధించిన ఇన్సూరెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అక్కడే బైఠాయిచి నిరసన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా పంట నష్ట పోయిన రైతులకు చెల్లించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలోని 60 వేల మంది రైతులకు 200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ బకాయిలు అందాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులు విషయంలో మొండిగా వ్యవహారిస్తున్నాయని విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా వైఎస్సార్ సీపీ సిద్ధమని తెలిపారు.