‘అంత డబ్బు’ రాహుల్‌ వల్ల అవుతుందా?

What We Know About Rahul Gandhi NYAY scheme - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పేదల సంక్షేమం కోసం కనీస ఆదాయ పథకాన్ని తన పార్టీ తీసుకొస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత జనవరి నెలలోనే ప్రకటించారు. వివరాలు అడిగితే ఈ విషయమై తమ పార్టీ నిపుణులతోని కలిసి కసరత్తు చేస్తోందని చెప్పారు. సోమవారం నాడు ఆయన ఈ విషయమై కొంత క్లారిటీ ఇచ్చారు. దేశంలో 20 శాతం మంది పేద ప్రజలు ఉన్నారని, వారిని కుటుంబాల పరంగా లెక్కిస్తే ఐదు కోట్ల కుటుంబాలు అవుతాయని, ప్రతి కుటుంబం జీవించాలంటే నెలకు కనీసం 12 వేల రూపాయలు అవసరమని, ప్రస్తుతం వారికి నెలకు ఆరు వేల రూపాయల ఆదాయమే వస్తోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నెలకు నేరుగా ప్రతి పేద కుటుంబం ఖాతాలో నెలకు ఆరువేల రూపాయలు జమ చేస్తామని రాహుల్‌ గాంధీ విలేకరుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చారు. పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే ‘న్యాయ్‌ (ఎన్‌వైఏవై)’ ఇంగ్లీషు సంక్షిప్త అక్షరాలతో హిందీ అర్థంతో పేరు కూడా పెట్టారు.

ఈ పథకంపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దేశంలో 20 శాతం మందే పేదలే ఉన్నారని, వారి కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయని రాహుల్‌ గాంధీ లేదా ఆయన ఆర్థిక వేత్తలు ఎలా అంచనా వేశారు ? 2011 తర్వాత ఇప్పటి వరకు సామాజిక వర్గాల అభ్యున్నతి ప్రాతిపదికన జన గణనే జరగలేదు. నాటి విశ్లేషణలోనే పలు లోపాలు ఉన్నాయి. తదుపరి సెన్సెస్‌ 2021లో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈపథకాన్ని లాంఛనంగా ప్రారంభించి  ‘సెన్సెస్‌’ అనంతరం పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా అమలు చేస్తారా?

రాహుల్‌ గాంధీ మాటల ప్రకారం ఓ కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు వచ్చినా, నెలకు 11 వేల రూపాయలు వస్తున్నా, ఆ కుటుంబాల వారందరికి నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందే. ‘ధనిక, పేద అనే రెండు హిందుస్థాన్‌లు ఉండరాదు. ఒకే హిందుస్థాన్‌ ఉండాలి’ అని ఆయన అన్నారు. అలాంటప్పుడు వెయ్యి రూపాయలు ఆదాయం వస్తున్న కుటుంబానికి నెలకు 6 వేల రూపాయలు బ్యాంకులో వేస్తే ఆ కుటుంబం ఆదాయం నెలకు 7 వేల రూపాయలు అవుతుంది. అదే నెలకు 11 వేల రూపాయలు వస్తున్న కుటుంబానికి ఆరు వేలు జమచేస్తే ఆ కుటుంబం నెల ఆదాయం 17 వేల రూపాయలు అవుతుంది. అంటే, పేద కుటుంబాల మధ్య కూడా పది వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ఇదెక్కడి సామాజిక న్యాయం? ఈ ప్రశ్నలు పక్కన పెడితే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?!

అసలు అమలు చేయడం సాధ్యమా?
ఓ కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయలు చెల్లించడమంటే ఏడాదికి 72 వేల రూపాయలు చెల్లించడం. ఐదు కోట్ల కుటుంబాలకు ఏడాదికి 72 వేల రూపాయలను చెల్లించాలంటే ఏడాదికి 3,60,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 13 శాతం, జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం వాటాకు సమానం. ఏడాదికి ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి మించకూడదంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితి విధుంచుకోగా ఇప్పటికే ద్రవ్యలోటు 3.4 శాతానికి చేరుకుంది. అలాంటప్పుడు జీడీపీలో రెండు శాతం అంటే 3,60,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్నకు రాహుల్‌ గాంధీ నుంచి గానీ, ఆ పార్టీ సీనియర్‌ నాయకుల నుంచిగానీ సరైన సమాధానం లేదు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల పారితోషకాన్ని ప్రకటిస్తే అందుకు పోటీగా రాహుల్‌ గాంధీ ఏకంగా నెలకే ఆరువేల రూపాయలను ప్రకటించారు. దేశ, విదేశాల్లో పేరుకుపోయిన నల్లడబ్బును వెలికి తీసే ‘జన్‌ధన్‌’ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానంటూ మోదీ ఇచ్చిన హామీ లాగే ఇది కూడా ‘జుమ్లా’ అవుతుందా? నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కుటుంబానికి 11 వేల రూపాయలు, 11 వేల రూపాయల వచ్చే కుటుంబానికి వెయ్యి చొప్పున, అందరికి సామాజిక న్యాయంగా 12 వేల రూపాయల కనీస ఆదాయం వచ్చేలా స్కీమ్‌ను అమలు చేస్తామని రాహుల్‌ చెప్పి ఉంటే బాగుండేది. అయితే పేద కుటుంబాలకు వస్తున్న ఆదాయాన్ని అంచనా వేయడం కూడా కష్టమే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top