‘హోదాపై రాజ్యసభలో నోటీస్‌ ఇచ్చాం’

Vijayasai Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

ఆర్టికల్‌ 300 ప్రకారం సుప్రీం కోర్టులో కేసు వేయాలి

చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఎక్కడికి పోయింది

వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో నోటీస్‌ ఇచ్చామని, ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. హోదా సాధించే విషయంలో టీడీపీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకే ఆర్థిక సాయం ప్రకటించారని, ఈ ప్యాకేజీకి ధన్యవాద తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఇంతకీ ఈ ధన్యవాద తీర్మానాన్ని చంద్రబాబు విత్‌డ్రా చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీపై ధన్యవాద తీర్మానం ఎలా పెట్టారని నిలదీశారు. నాలుగేళ్లు కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కాదా? అని, ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని టీడీపీ కోరలేదా అని మండిపడ్డారు.

ప్యాకేజీకి చట్టబద్దత కల్పించి ఉంటే హైకోర్టులో వ్యాజ్యం కూడా పెద్ద పొలిటికల్‌ డ్రామానే అని దుయ్యబట్టారు. ఆర్టికల్‌ 300 ప్రకారం సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికి పోయిందని, రాజకీయ డ్రామాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. బీజేపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా రాష్ట్రానికి ద్రోహం చేశాయన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిందే చం‍ద్రబాబు అని తెలిపారు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టారని, ఇప్పుడు ఆ కిరణే విభజన హామీలపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. హోదా ఎవరిస్తే వారికే తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top