
సాక్షి, అమరావతి బ్యూరో : మాజీ హోం మంత్రి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం కృష్ణా జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో పాదయాత్ర సాగిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. వారితోపాటు మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.
వసంత నాగేశ్వరరావు, కృష్ణ ప్రసాద్‌లకు జగన్.. కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీల్‌ఛైర్‌పై వచ్చిన నాగేశ్వరరావుతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. కృష్ణా జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు.
కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర మహోద్యమంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, పార్టీ నేతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దూలం నాగేశ్వరరావు, కోటగిరి శ్రీధర్, మొండితోక జగన్మోహనరావు, పేర్ని నాని, జోగి రమేష్, యలమంచిలి రవి, ఉప్పాల రామ్‌ప్రసాద్, కాజా రాజకుమార్, హనుమాల సు«ధాకరరావు, ఎం.నరసింహారావు, కోయి సుబ్రహ్మణ్యం, మాగంటి రామారావు, కోటేరు గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.