కారు.. సారు.. పదహారు.. నినాదమే బోగస్‌ | Uttam Kumar Reddy Fires On TRS Party | Sakshi
Sakshi News home page

కారు.. సారు.. పదహారు.. నినాదమే బోగస్‌

Mar 27 2019 1:41 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Fires On TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కారు.. సారు.. పదహారు అంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ చేస్తున్న నినాదమే బోగస్‌ అని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలున్నా ఈ ఐదేళ్లలో ఏం సాధించిందని ప్రశ్నించారు. మరోసారి 16 మంది ఎంపీలను గెలిపించాలనేది టీఆర్‌ఎస్‌ మొదలు పెట్టిన కొత్త డ్రామా అని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ఎందరు ఎంపీలున్నా లోక్‌సభలో మాట్లాడరని, తెలంగాణకు న్యాయం చేయరని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధాని చేయాలనే కాంక్ష దేశవ్యాప్తంగా ఏర్పడిందని ఉత్తమ్‌ తెలిపారు. దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మోదీ గద్దె దిగాలని, రాహుల్‌ ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని, రాహుల్‌ ప్రధాని అయ్యాక తెలంగాణకు కావాల్సిన వనరులన్నింటినీ సాధించుకొని వస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇంటర్వ్యూ విశేషాలివి..
సాక్షి: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల గడువు కూడా పూర్తయింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది?  
ఉత్తమ్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనేది తెలంగాణ ప్రజల ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారనేది మాకున్న స్పష్టమైన సమాచారం. 
 
బీజేపీ, ఇతర పార్టీలను కాదని మీకే ఎందుకు ప్రజలు ఓటేయాలనుకుంటున్నారు? 
2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని ప్రజలకు అర్థమైంది. అక్రమార్కులు విదేశాల్లో దాచిన నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ఒక్కో బ్యాంక్‌ అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పి రూ. 15 కూడా ఇవ్వలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించకపోగా చిన్న పరిశ్రమలు మూతపడి... ఉన్న ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ చెప్పగా రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి. వాటికితోడు దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైనారిటీలు అభద్రతాభావానికి గురయ్యేందుకు బీజేపీనే కారణమని అందరికీ అర్థమైంది. ఈ కారణాలన్నింటితో మోదీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. అదే సమయంలో పరిపక్వతగల నాయకుడిగా ఎదిగిన రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలనే కాంక్ష దేశవ్యాప్తంగా పెరిగింది. 
 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఉంది కదా... ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఎన్నుకోరని అనుకుంటున్నారు? 
ఐదేళ్లపాటు టీఆర్‌ఎస్‌ అన్ని విధాలుగా బీజేపీకి అండగా నిలిచింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో, అవిశ్వాసం సమయంలో ఆ పార్టీ ఎంపీలంతా బీజేపీకి ఓటేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలను కూడా టీఆర్‌ఎస్, కేసీఆర్‌ సమర్థించలేదా? ఇరుపార్టీల మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అవగతం అయింది. అందుకే కాంగ్రెస్‌కు ఓటేయాలన్న ఆలోచనకు, నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకు కేసీఆర్‌ దగ్గర ఎంత మంది ఎంపీలున్నారు. మిత్రపక్షాలైన బీజేపీ, ఎంఐఎంలను కలుపుకుంటే ఇప్పుడు కూడా 16 మంది ఉన్నారు కదా? మరి ఈ ఐదేళ్లలో వీళ్లు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటి? మళ్లీ ఇప్పుడు 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏదో చేసేస్తామంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. ఈ సాకుతో టీఆర్‌ఎస్‌కు ఓటేయడమంటే బీజేపీకి వేయడమే. వారికి 16 మంది ఎంపీలున్నా, ఒక్క ఎంపీ ఉన్నా నోరుమెదపరు. రాష్ట్రానికి మాత్రం యథేచ్ఛగా అన్యాయం జరుగుతుంది.  
 
తెలంగాణలో మీ పార్టీ నుంచి ఎంపీలను గెలిపిస్తే జరిగే లాభమేంటి? 
మా పార్టీ నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రంలో ఏదో ఒక భారీ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తాం. ఖాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయిస్తాం. గిరిజన యూనివర్శిటీని మంజూరు చేయిస్తాం. పార్లమెంటులో కొట్లాడి గిరిజనులు, ముస్లింలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధిస్తాం. 
 
ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనుకుంటున్నారు? 
కాంగ్రెస్‌ పార్టీ బలమైన పునాదులతో నిర్మితమైంది. సామాన్య కార్యకర్తల చెమట, రక్తం, త్యాగాల మీద నిలబడింది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన కొందరు అవకాశవాదులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదు. క్లిష్ట సమయంలో పారిపోతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. పార్టీకి ఎలాంటి నష్టం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తాం. 
 
కేసీఆర్‌కు ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం మాకు లేదు.. వాళ్లే ఇష్ట ప్రకారం పార్టీలోకి వస్తున్నారు అని టీఆర్‌ఎస్‌ చెప్తోంది కదా? 
వాళ్లకు అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తామేదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు తగిన సమయంలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. 
 
పార్టీలో ఇంకా గ్రూపులు, ఆధిపత్య పోరు జరుగుతోందని మీ పార్టీ నేతలే అంటున్నారు? 
అవన్నీ అర్థంలేని పిచ్చిమాటలు. అన్ని విధాలుగా పార్టీని సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో ఎవరికీ సందేహాలు ఉండాల్సిన పనిలేదు. 
 
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? రాహుల్‌ వస్తున్నారా? 
ప్రచారం 23వ తేదీ నుంచే ప్రారంభించాం. రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో ప్రచారానికి వస్తారు. సభల షెడ్యూల్‌ ఖరా>రు కావాల్సి ఉంది. 
 
కారు.. సారు.. పదహారు అనే టీఆర్‌ఎస్‌ నినాదం ప్రజల్లోకి వెళ్తున్నట్లుంది? 
ఆ నినాదమే బోగస్‌. వాళ్లకు 16 ఎంపీ సీట్లు వచ్చినా, ఒకటి వచ్చినా వృథానే! లోక్‌సభలో వాళ్లు నోరు విప్పేది లేదు. తెలంగాణ ప్రజలకు మంచి చేసేది లేదు. మెజారిటీ స్థానాల్లో మేం కచ్చితంగా విజయం సాధిస్తాం. 
 
ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీలో ఉండాలని, లేదంటే ఎన్నికలకు ముందే ఉత్తమ్‌ ఓటమిని అంగీకరించినట్లేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అంటున్నారు? 
జగదీశ్‌రెడ్డి ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన దయాదాక్షిణ్యాల మీద నేను ఎమ్మెల్యే కాలేదు. హుజూర్‌నగర్‌ ప్రజల ప్రేమ, అభిమానం నన్ను గెలిపించాయి. ఎంపీ స్థానంలో ఓడిపోతామనే భయంతోనే అలా మాట్లాడుతున్నారు. నన్ను రాజీనామా చేయమనడం కాదు. జగదీశ్‌రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో రాజీనామా చేయమనండి. ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నేను సిద్ధం. 
 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? 
టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను పరిశీలించారా? ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేని నల్లకుబేరులను అభ్యర్థులుగా ఎంపిక చేసి తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అవమానించారు. చులకన భావంతో చూశారు. నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూ కబ్జాకోరు. సమాజాన్ని దోచుకున్న వారిని ఎందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పెట్టారో, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఎందుకు పక్కనపెట్టారో కేసీఆర్‌ సంజాయిషీ ఇచ్చుకోవాలి. 
 
ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? 
దేశానికి బంగారు భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యం. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే రాహుల్‌ ప్రధాని కావాలి. మోదీ గద్దె దిగాలి. అందుకే తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement